
రాజన్న సిరిసిల్ల, వెలుగు : ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు బీమా సౌకర్యంతో పాటు ఏడాదికి రూ. 12 వేల చొప్పున ఆర్థికసాయం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఆటో డ్రైవర్ నాంపల్లి సతీశ్‌ను పరామర్శించారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ. 24 వేలు బాకీపడిందన్నారు. ఆటో డ్రైవర్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటివరకు 93 మందికిపైగా ఆటో డ్రైవర్లు చనిపోయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. చనిపోయిన ప్రతి కార్మికుడి ఫ్యామిలీకి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ. 2.30 లక్షల కోట్ల అప్పు చేసిందని, అయినా ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు, రోడ్డు వేయలేదన్నారు.
డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కొండూరి రవీందర్‌రావు, అందె సుభాశ్ ఉన్నారు. అనంతరం సిరిసిల్లలో జరిగిన వేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాల్లో కేటీఆర్ పాల్గొని రథాన్ని లాగారు.