సక్సెస్ : దెబ్బడగూడ అవకాడో

సక్సెస్ : దెబ్బడగూడ అవకాడో

ఒకప్పుడు మన దగ్గర పండే పండ్లనే తినేవాళ్లం. కానీ.. ఇప్పుడు విదేశాల్లో పండే పండ్లను కూడా మన దేశానికి దిగుమతి చేసుకుని మరీ తింటున్నాం. ఈ రైతు కాస్త అడ్వాన్స్​డ్​గా ఆలోచించి ‘దిగుమతి చేసుకోవడం కంటే.. మనమే పండించుకుంటే పోలే’ అనుకున్నాడు. అందుకే మెక్సికోలో ఎక్కువగా పండే అవకాడో పండ్లను పండిస్తున్నాడు.

పండ్ల మార్కెట్​లో ఇదివరకు ఎక్కువగా అరటి, జామ, నారింజ, దానిమ్మ, యాపిల్స్​ వంటివే కనిపించేవి. ఇప్పుడు వాటితో పాటు డ్రాగన్​ ఫ్రూట్​, అవకాడో లాంటి విదేశీ పండ్లు కూడా కనిపిస్తున్నాయి. డ్రాగన్​ ఫ్రూట్​ మన దగ్గర ఎప్పటినుంచో పండిస్తున్నారు. అందుకే రమావత్ జైపాల్ కొత్తగా ఉంటుందని అవకాడో సాగు చేస్తున్నాడు. ఈయనది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడ అనుబంధ గ్రామమైన దెబ్బడగూడ తండా. గిరిజన వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు.

బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి పై చదువుల కోసం యునైటెడ్​ స్టేట్స్​ వెళ్లాడు. అక్కడ మాస్టర్స్​ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చాడు. ఇక్కడికొచ్చాక ఉద్యోగం చేయడం ఇష్టంలేక సొంతంగా ఏదైనా చేయాలి అనుకున్నాడు. ఆ ఆలోచన నుంచి వచ్చిందే అవకాడో సాగు.  మూడేండ్ల క్రితం 220 అవకాడో మొక్కలను రెండెకరాల్లో నాటాడు. ఎలాంటి ఎరువులు వేయకుండానే మొక్కలు ఏపుగా పెరిగి కాతకు వచ్చాయి.

మామిడికాయలా...

ఈ చెట్టు సుమారు 20 మీటర్ల (66 అడుగులు) వరకు పెరుగుతుంది. ప్రపంచంలోని అన్ని శీతోష్ణ, సమశీతోష్ణ మండలాల్లో ఈ చెట్లను పెంచొచ్చు. పండు కోతకు వచ్చినప్పుడు బాగా కండ పట్టి ఆకుపచ్చ రంగు తోలుతో చూడటానికి మామిడికాయలా ఉంటుంది.

ఆవు వెన్న రుచితో..

అవకాడోను బటర్ ఫ్రూట్ (వెన్న పండు) అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం ‘పెర్సీ అమెరికాన’. అల్లెగటర్ పియర్ అని కూడా పిలుస్తారు. ఈ కాయలు ఆకుపచ్చగా లేదా నల్లగా ఉంటాయి. లోపల మెత్తగా ఉంటుంది. తింటే ఆవు వెన్న రుచి తగులుతుంది నోటికి. కాస్త చేదుగా కూడా ఉంటుంది. అవకాడో మధ్యలో ఉండే గింజను మెడిసిన్​ తయారీలో వాడతారు.

ఆరోగ్యానికి మేలు

అవకాడో పండు గుజ్జు అనవసరమైన కొలెస్ట్రాల్​ను తగ్గించి, అవసరమైన కొలెస్ట్రాల్​ను పెంచుతుంది. క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్​లను అవకాడో అదుపు చేస్తుందట. అవకాడోలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్​ ఉంటుంది. గర్భవతులు అవకాడో తింటే పిల్లలకు పుట్టుకతో వచ్చే కొన్ని అరుదైన వ్యాధులను నిరోధించవచ్చని కాలిఫోర్నియా అవకాడో కమిషన్​ చెప్పింది. మోనో అన్​శాచ్యురేటెడ్ కొవ్వుల శాతం, విటమిన్–సి ఎక్కువ. శక్తివంతమైన యాంటీ–ఆక్సిడెంట్లు, విటమిన్– బి6 పుష్కలం.

అరుదైన పంట సాగుకు

ప్రపంచంలో అవకాడో ఉత్పత్తిలో మెక్సికోది మొదటి స్థానం. ఆ దేశ వాతావరణం అవకాడో పంటకు అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఈ పంట బాగా పండుతుంది. అదే పంట ఇక్కడ కూడా పండటంతో ఎంతోమంది రైతులు ఈ పంట గురించి తెలుసుకునేందుకు  జైపాల్​ దగ్గరకు ‘క్యూ’ కడుతున్నారు. సాగు వివరాలు తెలుసుకుంటున్నారు. పండ్ల కోసం ఫోన్లు చేస్తున్నారు. 

ఇక్కడ కూడా పండుతుంది

ఈ పంటల సాగు కాస్త ఖర్చుతో కూడుకున్నది. పంట రావడానికి కూడా టైం పడుతుంది. అంతవరకు నిలదొక్కుకోవడం చాలామందికి కష్టమే. అలాంటి వాళ్లకు ప్రభుత్వం సాయం చేయాలి. పంటల సాగుకు అవసరమయ్యే డ్రిప్ లాంటి పరికరాలు, మల్చింగ్​ షీట్ ఇవ్వాలి. అవకాడో మన వాతావరణంలో కూడా పండుతుంది. అవకాడో సాగు చేయాలనుకునే వాళ్లకు మొక్కలు ఇస్తా. సాగు పద్ధతుల గురించి చెప్తా. ఈ పంటకు ఎలాంటి పురుగు మందులు వాడాల్సిన అవసరం ఉండదు. కిలో పండ్లకు నాలుగొందలకు పైగా ధర వస్తుంది.     

– రమావత్​ జైపాల్

ఎస్​. పాండు రంగారెడ్డి ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా