నల్గొండ కలెక్టరేట్​లో ప్లేస్ చాలక అవార్డుల ఫంక్షన్​ రద్దు

నల్గొండ కలెక్టరేట్​లో ప్లేస్ చాలక అవార్డుల ఫంక్షన్​ రద్దు
  •     10 నిమిషాల్లోనే రిపబ్లిక్​ డే వేడుకలు ముగింపు
  •     ఆఫీసర్ల తీరుపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి

నల్గొండ, వెలుగు:  రిపబ్లిక్​డే వేడుకల్లో భాగంగా  వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల సేవలకు గుర్తింపుగా ఇచ్చే అవార్డులను నల్గొండ జిల్లాలో రద్దు చేశారు. ఇందుకు ఉన్నతాధికారులు చెప్పిన కారణం వింతగా ఉంది. వేడుకలు జరిగిన కలెక్టరేట్​లో సరిపడా జాగ లేకపోవడం వల్లే అవార్డుల ఫంక్షన్​ రద్దు చేసినట్లు చెప్పడంతో స్టాఫ్​అంతా నారాజ్​ అయ్యారు. 

పరేడ్ గ్రౌండ్​లో రద్దు.. 

ఎప్పట్లాగే రిపబ్లిక్​ డే వేడుకలు పరేడ్​ గ్రౌండ్​లోనే జరుగుతాయనే ఆలోచనతో నల్గొండ జిల్లా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రి వరకు పోలీసులతో ప్రీ పరేడ్​ కూడా నిర్వహించారు. కానీ సర్కారు నుంచి ఆదేశాలు రావడంతో రాత్రికి రాత్రే వేదికను పరేడ్​ గ్రౌండ్స్​నుంచి కలెక్టరేట్​కు మార్చారు. కరోనా కారణంతో వేడుకలు వద్దని ప్రభుత్వం చెప్పడంతో గురువారం నల్గొండ కలెక్టరేట్​లో రిపబ్లిక్​ డే కార్యక్రమాన్ని  కేవలం 10 నిమిషాల్లోనే ముగించారు. అంత తక్కువ టైంలో జెండా ఆవిష్కరించిన కలెక్టర్, ముఖ్య ప్రజాప్రతినిధులతో మీటింగ్​ హాల్​లో కొద్దిసేపు మాట్లాడి సెలబ్రేషన్స్​ ముగిశాయని చెప్పి పంపించారు. కానీ ఉద్యోగులకు, అధికారులకు అవార్డులు, లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ ఉంటుందని భావించారు. ఈ మేరకు డిపార్ట్​మెంట్ల వారీగా అవార్డుల ఎంపిక లిస్ట్​లు కూడా ప్రిపేర్​ చేశారు. 

జాగా లేకనే ఇయ్యలేదట..

కలెక్టరేట్​ భవన్​ ముందు ఉన్న ఖాళీ స్థలం జెండా ఎగురవేయడానికి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించడానికే  సరిపోయిందని, అవార్డులు ఇచ్చేందుకు సరిపడా స్థలం లేకపోవడంతో ఫంక్షన్​ రద్దు చేశామని ఉన్నతాధికారులు ఆయా శాఖల హెచ్​ఓడీలకు సమాచారం ఇచ్చారు. కానీ కొత్త జిల్లాలైన సూర్యాపేట, యాదాద్రిలో అవార్డుల ప్రోగ్రాం జరగడం, రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాగా గుర్తింపున్న నల్గొండలో మాత్రం రద్దు చేయడంతో గెజిటెడ్​ ఆఫీసర్ల సంఘం, పంచాయతీరాజ్​, రెవెన్యూ ఉద్యోగుల సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు తలుచుకుంటే ఉన్న కొద్ది జాగలోనైనా అవార్డులు ఇచ్చే అవకాశముండేదని, కానీ కావాలనే కార్యక్రమాన్ని రద్దు చేసి దానికో నెపం వెతుక్కున్నారని విమర్శిస్తున్నారు.