మూడు తలల చిన్నారి!

మూడు తలల చిన్నారి!

పెద్ద పెద్ద కణతులతో యూపీలో పుట్టిన బాలిక

మూడు తలలతో పుట్టిందీ చిన్నారి. ఉత్తర్​ప్రదేశ్​లోని ఈటా జిల్లా పిలువా గ్రామానికి చెందిన ఓ మహిళ జులై 11న కాన్పు కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమె మూడు తలలతో చిన్నారికి జన్మనిచ్చింది. అది చూసి షాక్​ తిన్న కుటుంబ సభ్యులు, డాక్టర్లు, వెంటనే ఈటా జిల్లా ఆస్పత్రికి ఆ చిన్నారిని తరలించారు. ఇలాంటి ఘటనలు అరుదని డాక్టర్లు చెబుతున్నారు. ఎంఆర్​ఐ స్కాన్లు తీసిన తర్వాత ఆ తలల్లాంటి పెద్ద పెద్ద ‘కణతులను’ తొలగిస్తామని జిల్లా ఆస్పత్రి చీఫ్​ మెడికల్​ సూపరింటెండెంట్​ రాజేశ్​ ఠాకూర్​ చెప్పారు. ప్రపంచంలో ఇలాంటి కేసులు రావడం చాలా తక్కువని, ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితిని ‘ఎన్​సెఫలోసీల్​’ అంటారని చెప్పారు.

నరాల వ్యవస్థల్లోని లోపం వల్ల పుర్రె ఎముక సరిగ్గా ఎదగదని, దాని ఫలితంగా ఇలాంటి పెద్ద కణతులను తలకు ఆనుకుని పుట్టుకొస్తాయని చెప్పారు. ఆ భాగాల్లోకీ మెదడు కణజాలం విస్తరిస్తుందని, తలకు సంబంధించిన ఇతర రక్తనాళాలు, నరాలు వాటిలో ఏర్పడతాయని వివరించారు. ఇలాంటి లోపంతో పుట్టే పిల్లలు బతికే చాన్స్​ కేవలం 55 శాతం అని చెబుతున్నారు. ఒక వేళ బతికినా జీవితాంతం మానసిక రోగాలతో బాధపడతారని, మెదడు ఎదగదని అంటున్నారు. ఇక, ఈ ఏడాది మార్చి 4న కాశ్మీర్​లోనూ అలాంటి లోపంతో ఓ బాబు పుట్టాడు. భారమవుతాడని భావించిన అతడి తండ్రి, బతికుండగానే పూడ్చిపెట్టబోతుండగా పోలీసులు ఆపి ఆస్పత్రికి తరలించారు. షేర్​ ఈ కాశ్మీర్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ (స్కిమ్స్​)లో ఆ అదనపు తలను వేరు చేశారు. మామూలు మెదడు నుంచి లోపమున్న మెదడునూ తొలగించారు. మూడు గంటల పాటు చేసిన ఆపరేషన్​ సక్సెస్​ అయింది. తర్వాత ఆ చిన్నారిని అతడి బాబాయి దత్తత తీసుకున్నాడు. మరో ఘటనలో బెంగళూరులోని సప్తగిరి హాస్పిటల్​ వైద్యులూ ఐదు నెలల చిన్నారికీ అలాంటి ఆపరేషనే చేశారు.