ఇమ్రాన్​ ఖాన్​ను  రిలీజ్ చేయండి.. పాక్ సుప్రీం ఆదేశం

ఇమ్రాన్​ ఖాన్​ను  రిలీజ్ చేయండి.. పాక్ సుప్రీం ఆదేశం

ఇస్లామాబాద్:  పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అక్రమమని ఆ దేశ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఉమర్ అతా బండియాల్, జస్టిస్ మహమ్మద్ అలీ మజర్, జస్టిస్ అథర్ మినాల్లాతో కూడిన సుప్రీం బెంచ్ గురువారం తీర్పు ఇచ్చింది. అల్ ఖాదిర్ ట్రస్టుకు అక్రమంగా భూమి బదిలీ చేసుకున్నారని, రూ.5 వేల కోట్ల (పాక్ కరెన్సీ) అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇమ్రాన్ ను నేషనల్ అకౌంటెబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) అరెస్టు చేసింది. మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకుంది. అయితే ఇమ్రాన్ అరెస్టును సవాల్ చేస్తూ పీటీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 

దీనిపై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. ఇమ్రాన్ ను అరెస్టు చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గంటలోగా ఇమ్రాన్ ను తమ ముందు హాజరుపరచాలని మొదట ఎన్ఏబీని ఆదేశించింది. ఆ తర్వాత తిరిగి విచారణ కొనసాగించింది. ‘‘కోర్టుకు వచ్చిన వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారు? ఎవరినైనా కోర్టులో అరెస్టు చేయాలంటే రిజిస్ట్రార్ పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలి కదా? ఒక వ్యక్తి కోర్టుకు వచ్చాడంటే, అతను సరెండర్ అవుతున్నాడని అర్థం. అలాంటప్పుడు సరెండర్ అయిన వ్యక్తిని అరెస్టు చేసుడేంది?” అని ఎన్ఏబీని కోర్టు ప్రశ్నించింది. ‘‘ఇమ్రాన్ ను అరెస్టు చేసేందుకు 100 మంది రేంజర్లు అక్రమంగా కోర్టు ఆవరణలోకి రావడం కోర్టు ధిక్కరణే” అని ఫైర్ అయింది. అలాగే శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టులో హాజరుకావాలని ఇమ్రాన్ ను ఆదేశించింది. కోర్టు చెప్పినట్టు నడుచుకోవాలని సూచించింది. దేశంలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని, నిరసనలు ఆపాలని చెప్పింది.  

ఇమ్రాన్​ సన్నిహిత నేత ఖురేషీ అరెస్టు.. 

ఇమ్రాన్ సన్నిహితుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీని ఇస్లామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గురువారం కూడా పాక్ లో నిరసనలు కొనసాగాయి. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణల్లో ఇప్పటి వరకు 8 మంది చనిపోగా 300 మందికి గాయాలయ్యాయి. ఇస్లామాబాద్ సహా పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సులలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఈ నాలుగు చోట్ల ఆర్మీని రంగంలోకి దించారు. ఈ ఆందోళనల వెనుక కొంతమంది నేతలు ఉన్నారని, వాళ్లందరిపై చర్యలు తీసుకుంటామని ఆర్మీ చెప్పింది. ఈ ఘర్షణలు దేశ చరిత్రలోనే చీకటి ఆధ్యాయం అని పేర్కొంది. ఆర్మీ ఆస్తులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.