
- రిక్టర్ స్కేల్‌పై 4.8, 4.6 గా నమోదు
- బారాముల్లా జిల్లాలో భూకంప కేంద్రం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతం లో మంగళవారం ఉదయం రెండు వరుస భూకంపా లు సంభవించాయి. భూకంపంతో కాశ్మీర్ లోయలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి ఇంకా ఎలాంటి వివరాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఉదయం 6:45 గంటలకు సంభవించిన మొదటి భూకంపం రిక్టర్ స్కేల్‌పై 4.9 తీవ్రతను నమోదు చేసింది. 5 కి.మీ లోతులో ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భూకంప కేంద్రంతో ఉన్నట్లు అధికారులు తెలిపారు. తర్వాత ఉదయం 6:52 గంటలకు 4.8 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. దీని భూకంప కేంద్రం కూడా బారాముల్లా జిల్లాలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు వెల్లడించారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) లోనూ
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లో మంగళవారం ఉదయం రెండు భూకంపాలు సంభవించాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) వివరాల ప్రకారం రెండు భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై5.1 గా నమోదైంది. భూకంపాల ప్రభావంతో ముజఫరాబాద్‌లో ఇంటర్నెట్ సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలిగింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఎలాటి వివరాలు తెలియరాలేదని పాక్ మీడియా పేర్కొంది.