మార్చి 12 తర్వాత వర్చువల్ గా హాజరవుతా : ఢిల్లీ సీఎం

మార్చి 12 తర్వాత వర్చువల్ గా హాజరవుతా :  ఢిల్లీ సీఎం
  • ఆయనకు అలాంటి అవకాశం ఇవ్వకూడదు: బీజేపీ

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్  స్కాం కేసులో ఆప్  కన్వీనర్, సీఎం కేజ్రీవాల్  ఎనిమిదోసారి కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు డుమ్మా కొట్టారు. ఈ కేసులో సోమవారం విచారణకు రమ్మంటూ ఈడీ ఇటీవల సమన్లు జారీ చేయగా.. ఆయన వెళ్లలేదు. ఇంతకుముందు కూడా ఈడీ ఏడుసార్లు సమన్లు పంపినా పట్టించుకోలేదు. ఈ నెల 12 తర్వాత వర్చువల్ గా విచారణకు హాజరవుతానని కేజ్రీవాల్  తెలిపారు. కానీ, ఆయన అభ్యర్థనను ఈడీ అధికారులు తిరస్కరించే అవకాశం ఉందని సమాచారం. కాగా, లోక్ సభ ఎన్నికల ముందు  కేజ్రీవాల్ ను అరెస్టు చేయడమే ఈడీ ఉద్దేశంగా కనిపిస్తున్నదని ఆప్  ఆరోపించింది. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని అదేపనిగా తమ అధినేతకు సమన్లు జారీచేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఆయన కోరుతున్నట్లు వీడియో కాన్ఫరెన్స్ లోనే ప్రశ్నించాలని, అది కూడా లైవ్ టెలికాస్ట్‌‌  చేయాలని ఆప్  డిమాండ్  చేసింది. కాగా, ఎన్నిసార్లు సమన్లు పంపినా విచారణకు రావట్లేదంటూ కేజ్రీవాల్​పై ఈడీ అధికారులు సిటీ కోర్టులో కేసు వేశారు. 

ఈ నెల 16న కేజ్రీవాల్ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎనిమిదో సారి కూడా ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన కేజ్రీవాల్ పై బీజేపీ ఎంపీ మనోజ్  తివారీ తీవ్రంగా మండిపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్ లో హాజరవుతానన్న విజ్ఞప్తికి అంగీకరించవద్దని, ఆయనకు ఎలాంటి సడలింపులు ఇవ్వకూడదని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తివారీ వ్యాఖ్యానించారు. విచారణను తప్పించుకుంటూ ఢిల్లీ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని ఆయన నిలదీశారు.