బల్దియా జెన్ ఏఐ ప్రాజెక్ట్!

బల్దియా జెన్ ఏఐ ప్రాజెక్ట్!

హైదరాబాద్ సిటీ, వెలుగు : పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు గూగుల్‌తో బల్దియా చేతులు కలిపింది. ఏఐ కంటే అడ్వాన్స్ అయిన జెన్ ఏఐ ఆధారిత పైలట్‌ ప్రాజెక్ట్​ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. సోమవారం గూగుల్ క్లౌడ్ ప్లాట్ ఫాం టీమ్ తో పురపాలక శాఖ కార్యదర్శి డాక్టర్​ఇలంబరితి, బల్దియా కమిషనర్ కర్ణన్, ఐటీ అడిషనల్​కమిషనర్ అనురాగ్ జయంతి గూగుల్‌ మీట్‌ ద్వారా వర్చువల్‌ గా సమావేశమయ్యారు.  ఈ ప్రాజెక్ట్​ స్మార్ట్, హెల్దీ, ఫ్రెండ్లీ హైదరాబాద్‌ను నిర్మించే దిశలో ఒక ముందడుగు అని  కమిషనర్ అన్నారు. 

ఏఐ ఆధారిత ప్రభుత్వ, పౌర సేవలతో పాటు ప్రభుత్వ వెబ్‌సైట్ల కోసం జనరేటివ్‌ ఏఐ సెర్చ్‌ బార్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల కోసం కన్వర్సేషనల్‌ చాట్‌బాట్‌లు,  ఏఐ సెర్చ్‌ టూల్స్‌ ఉంటాయన్నారు. స్మార్ట్‌ పార్కింగ్‌ నిర్వహణ సాధ్యమవుతుందని, ఏదైనా దరఖాస్తు చేసుకోవడానికి ఆటోమేటెడ్‌ ఫారమ్‌ ఫిల్లింగ్‌ ఆప్షన్​ఉంటుందన్నారు. గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా బస్సుల రియల్‌- టైమ్‌ ట్రాకింగ్‌ చేయవచ్చన్నారు. రోడ్‌ సేఫ్టీ, ట్రాఫిక్‌ కు సంబంధించి ఏఐ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. చెరువుల్లో చెత్త వేయకుండా పర్యవేక్షించవచ్చన్నారు. ఆశా వర్కర్ల కోసం ఏఐ అసిస్టెంట్‌ సేవలు వినియోగించుకోవచ్చన్నారు.