BAN vs NED: ప్రపంచ కప్‍లో మరో సంచలనం.. బంగ్లాదేశ్‌పై నెదర్లాండ్స్ విజయం

BAN vs NED: ప్రపంచ కప్‍లో మరో సంచలనం.. బంగ్లాదేశ్‌పై నెదర్లాండ్స్ విజయం

భారత క్రికెట్‌ మక్కా ఈడెన్‌ గార్డెన్‌ వేదికపై నెదర్లాండ్స్ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. అగ్రశ్రేణి జట్లను ఓడిస్తామని ప్రగల్భాలు పలికే.. బంగ్లాదేశ్‌ను 87 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ టోర్నీలో డచ్ జట్టుకు ఇది రెండో విజయం. ఇంతకుముందు వీరు దక్షిణాఫ్రికాపై విజయం సాధించారు.

మొదట నెదర్లాండ్స్‌ను 229 పరుగులకే కట్టడి చేసినప్పటికీ.. బంగ్లా ఆటగాళ్లు దాన్ని చేధించలేకపోయారు. 42.2 ఓవర్లలో 142 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు. ఛేదనలో బంగ్లా ఆటగాళ్లు ఆదిలోనే తడబడ్డారు. డచ్‌ బౌలర్ పాల్‌ వాన్‌ మీకెరెన్‌ ధాటికి ఆ జట్టు ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. లిట్టన్ దాస్‌ (3), తాంజిద్‌ హసన్‌ (15), నజ్ముల్‌ హోసేన్‌ శాంతో (9), షకిబ్‌ అల్  హసన్‌ (5), ముష్ఫీకర్‌ రహీమ్‌ (1) వెంటవెంటనే ఔట్ అయ్యారు. దీంతో బంగ్లాదేశ్ కోలుకోలేకపోయింది. 35 పరుగులు చేసిన మెహిది హసన్‌ మిరాజ్‌ బంగ్లా జట్టులో టాప్ స్కోరర్. 

అంతకుముందు నెదర్లాండ్స్‌ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగుల వద్ద ఆలౌట్‌ అయ్యింది. డచ్ కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (68; 89 బంతుల్లో 6 ఫోర్లు), సిబ్రండ్‌ సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ ( 35; 61 బంతుల్లో 3 ఫోర్లు) పర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో  టస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, షోరిఫుల్‌ ఇస్లాంలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.

అట్టడుగున ఇంగ్లాండ్

ఈ విజయంతో నెదర్లాండ్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి ఎగబాకగా, ఇంగ్లాండ్ జట్టు అట్టడుగున నిలిచింది.