కరీంనగర్, వెలుగు: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆలపించిన ఆర్ఎస్ఎస్ గీతాల వీడియోలను శుక్రవారం కరీంనగర్‌లో విడుదల చేశారు. ‘గళమెత్తి పాడాలి’, ‘మాతృమూర్తి పదాల ముందర’ అనే రెండు గీతాల వీడియోలను శ్రీరామ నవమి సందర్భంగా ఆవిష్కరించారు.
ఆర్ఎస్ఎస్ స్థాపనకు వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సంఘ్ సిద్ధాంతాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో బండి సంజయ్ ఈ గీతాలను ఆలపించారు. చిన్ననాటి నుంచే ఆర్ఎస్ఎస్‌లో పనిచేస్తున్న ఆయన, సంఘ్ భావజాలాన్ని సామాన్యులకు చేరవేయాల్సిన అవసరం ఉందని సన్నిహితులు సూచించడంతో ఈ పాటలు రికార్డు చేసినట్లు తెలిపారు. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో వేలాది మంది భక్తులు, చిన్నారుల సమక్షంలో ఈ వీడియోలను విడుదల చేశారు. కార్యక్రమానికి రచయిత ఆకుల నాగేశ్వర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
