రాష్ట్రంలో అధికారం మారాకే స్వేచ్ఛ వచ్చింది

రాష్ట్రంలో అధికారం మారాకే స్వేచ్ఛ వచ్చింది
  • సిరిసిల్లలో ఇదివరకు నా ఫ్లెక్సీలు 
  • కట్టేందుకు భయపడే పరిస్థితి.. ఇప్పుడు ధైర్యం వచ్చింది: బండి సంజయ్‌‌‌‌
  • ఎన్నికల వరకే రాజకీయాలు.. తర్వాత అభివృద్ధి గురించే ఆలోచన చేయాలని వ్యాఖ్య

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా సిరిసిల్లలో నియంతృత్వ పోకడలకు ప్రజలు బుద్ధిచెప్పడంతో బీజేపీతో పాటు ఇతర పార్టీల క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, పలు సంఘాలకు భయం పోయిందన్నారు. గతంలో సిరిసిల్లలో పర్యటించినప్పుడు తమ పార్టీ క్యాడర్, సంఘాలు తన ఫ్లెక్సీలు పెట్టేందుకు భయపడే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు తాను కేంద్ర మంత్రి అయ్యాక వారికి ధైర్యం వచ్చిందన్నారు.

ఇప్పుడు అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ, సన్మానాలు కూడా చేస్తున్నారని తెలిపారు. సోమవారం బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ సిరిసిల్ల నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, మాట్లాడారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధి గురించి ఆలోచన చేయాలన్నారు. ఇకపై రాజకీయ విమర్శలు చేసుకోవద్దని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఆయా సంఘాలకు భవన నిర్మాణాలకు నిధులు కేటాయిస్తానని చెప్పారు. ఆయా సంఘాలు భవనాలతో పాటు ఫంక్షన్ హాల్స్ నిర్మించుకుంటే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కరీంనగర్ పరిధిలో రోడ్లు, రవాణా మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మోదీ నాయకత్వంలో నేషనల్ హైవేలు, రైల్వేలు, విద్యా, వైద్యం, పేదల సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పారు. 

నేను ఎప్పటికీ మారను..

‘‘నేను నిగర్విని.. కేంద్ర మంత్రి పదవి వచ్చిందని మారను. ఎప్పటికీ ఇలాగే ఉంటా. మీ ప్రేమ అభిమానాలు పొందుతా’’అని సంజయ్ అన్నారు. సెక్యూరిటీ ఎక్కువగా ఉండడం వల్ల అందర్ని కలవలేకపోతున్నానని చెప్పారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని చెప్పారు. గతంలో తనకు 80 వేల ఓట్ల మెజార్టీ వస్తే.. ఈసారి 2.50 లక్షలకు పైగా మెజార్టీ వచ్చిందన్నారు.

సిరిసిల్లలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్, కాంగ్రెస్ లీడర్లు తనకు పరోక్షంగా సపోర్ట్ చేశారన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతంగా ఉంటానన్నారు. సంజయ్‌‌‌‌‌‌‌‌ వెంట సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ తదితరులు ఉన్నారు.