జూన్4న బీఆర్ఎస్ దుకాణం బంద్ : బండి సంజయ్

జూన్4న బీఆర్ఎస్ దుకాణం బంద్ : బండి సంజయ్

కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా.... మోకాళ్ల యాత్ర చేసినా జనం ఆయన్ను నమ్మే పరిస్థితి లేదన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ ను నమ్మడం లేదన్నారు.   ఈ విషయం కేసీఆర్ కు తెలుసు కాబట్టే ఈనెల 27న బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించడం లేదున్నారు.  జూన్ 4న బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం తథ్యమని జోస్యం చెప్పారు సంజయ్ . 

బీఆర్ఎస్ హయాంలో కమీషన్లకు కక్కుర్తి పడి కట్టిన ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయని చెప్పారు బండి సంజయ్.  మొన్న కాళేశ్వరం.. ఇవ్వాళ పెద్దపల్లి బ్రిడ్జి ఇందుకు నిదర్శనమని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలు, మోసాల పట్ల ప్రజలు విసిగిపోయారన్నారు.  ఆ పార్టీ  నేతలు ఎన్ని మొసలి కన్నీరు కార్చినా, పొర్లు దండాలు పెట్టినా ఎవరు నమ్మరని తెలిపారు.  

కాంగ్రెస్ నేతలు టీవీల్లో బ్రేకింగ్ ల కోసం బీజేపీపైన, తనపైన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్.  మంత్రి పదవిలో ఉన్నామనే సోయి లేకుండా  కొంతమంది వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని ఫైరయ్యారు.  ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని, ప్రభుత్వ విధానాలపైన ప్రశ్నిస్తుంటే.. వ్యక్తిగత దూషణలు, బూతులు తిట్టడం ఎంతవరకు న్యాయమో విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని కోరారు. ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు.  సంయమనం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సమయం చూసి కర్రు కాల్చి వాతపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకుని హుందాగా వ్యవహరించాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీల నేతలందరిపైనా ఉందన్నారు.