కారు నడిపేది  మజ్లిసే

కారు నడిపేది  మజ్లిసే

సంగారెడ్డి, వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే జనాభా నియంత్రణ చట్టంపైనే మొదటి సంతకం చేయిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీనిచ్చారు. ఉత్తరప్రదేశ్ మాదిరిగా జనాభా నియంత్రణపై తెలంగాణలో కూడా బీజేపీ ఆలోచిస్తోందన్నారు.  బీజేపీ దేశ భక్తి గల పార్టీ అని.. ఇస్లాం, క్రిస్టియానిటీని ఎక్కడ వ్యతిరేకించడం లేదన్నారు.  15 నిమిషాల టైమిస్తే హిందువులను అంతం చేస్తానన్న ఎంఐఎం విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కారుకు ఓనర్ టీఆర్ఎస్ ​అయినప్పటికీ డ్రైవింగ్ మాత్రం మజ్లిస్​ చేతిలో ఉందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 11వ రోజు మంగళవారం సంగారెడ్డి జిల్లాలో సాగింది. 65వ నేషనల్ హైవే మీదుగా సంగారెడ్డి టౌన్ ​వరకు పాదయాత్ర కొనసాగగా ఎమ్మెల్యే రఘునందన్​రావు, మాజీ మంత్రి బాబు మోహన్, శోభరాణి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్​లు సంజయ్​తో పాటు నడిచారు. సాయంత్రం సంగారెడ్డిలో బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు. సెప్టెంబర్​17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని డిమాండ్​ చేశారు. అదే రోజు నిర్మల్ గడ్డపై బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని జరిపిస్తామని చెప్పారు. 

హామీలు నెరవేర్చమంటే రెచ్చగొట్టినట్టా?

టీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గట్టిగా ప్రశ్నిస్తే అది రెచ్చగొట్టినట్టు ఎలా అవుతుందని సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంక్షన్ అయిన 2.73 లక్షల ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారుల లిస్ట్​ కేంద్రానికి ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం నిరక్ష్యం వల్లే అర్హులకు నష్టం జరగుతోందన్నారు. లబ్ధిదారుల జాబితా కేంద్రానికి ఇస్తే ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన పథకం కింద పేదలకు ఎన్ని లక్షల ఇండ్లయినా శాంక్షన్​ చేయించే బాధ్యత తనదని తెలిపారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్.. ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇయ్యలేక చలాన్ల రూపంలో పేదలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి నికృష్ట పాలనలో దళిత బంధు పథకాన్ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యంపై సూర్యాపేట జెడ్పీ సీఈవో చేసిన కామెంట్​కు కేసీఆర్ సీరియస్ అయి మరో చోటికి బదిలీ చేశారని విమర్శించారు.  

ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉంటాం

ఎస్సీ, ఎస్టీలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని సంజయ్ చెప్పారు. పాదయాత్ర సందర్భంగా పత్తి రైతులు సమస్యలు చెప్పుకోగా.. కొండాపూర్ మండలం సైదాపూర్ గిరిజన రైతులు తమ భూములకు పాస్​బుక్​లు ఇవ్వట్లేదని సంజయ్​కు చెప్పారు.  రైతులకు బీజేపీ అండగా ఉంటుందని.. వారి పక్షాన పోరాడతామని ఆయన చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచైనా పాస్​బుక్​లు ఇప్పిస్తానని హామీనిచ్చారు.

సాధువుల అరెస్టు ఖండిస్తున్నం

హైదరాబాద్, వెలుగు: సాధువులను అరెస్టు చేయడం దుర్మార్గమని సంజయ్ అన్నారు.  జూబ్లీహిల్స్ హనుమాన్ ఆలయానికి సంబంధించిన ఘటనలో 15 మంది సాధువులను పోలీసులు అరెస్టు చేయడాన్ని  ఖండిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసులు ఈ అరెస్టులకు పాల్పడ్డారని మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. భూవివాదం ఆసరాగా అధికార పార్టీ లీడర్లు వెనకుండి ఈ కూల్చివేతను నడిపించారని ఆరోపించారు. టీఆర్ఎస్ సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తోందని ఫైర్ అయ్యారు. సాధువుల అరెస్టును హిందూ సమాజంపై దాడిగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు.

ఇది కేసీఆర్​పై దండయాత్ర

బండి సంజయ్​ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కేసీఆర్​పై చేస్తున్న దండయాత్ర. ఈ ధర్మ యుద్ధంలో బీజేపీ గెలుస్తుంది. కేసీఆర్ సర్కార్​ జూటా హామీలిస్తూ ప్రజలను మోసం చేస్తోంది. తెలంగాణ యువకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. యువత ఒక్కసారి ఆలోచించి రాష్ట్ర రాజకీయాలను శాసించే దిశగా మార్పు తేవాలి. .
– యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య