
- పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయండి
- కేంద్ర ఇంధన, పునరుత్పాదక శాఖ మంత్రికి ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి
కరీంనగర్ సిటీ, వెలుగు : కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లోని మిడ్, లోయర్ మానేరు ప్రాజెక్టులపై సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఇంధన, పునరుత్పాదక శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ను కలిసిన ఆయన.. మానేరు నదిపై ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే వచ్చే ప్రయోజనాలను వివరించారు. ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్ నిర్మాణం ద్వారా రిజర్వాయర్ల నుంచి నీటి ఆవిరిని తగ్గించవచ్చని.. నీటి ఎద్దడికి గురయ్యే ప్రాంతాలకు ఇది ప్రయోజనకరమని వివరించారు. వీటి ఏర్పాటుకు భూమి అవసరం లేదని, పరిమితమైన స్థలంలోనే ఏర్పాటు చేసే అవకాశముందన్నారు. ఈ అంశాలను పరిశీలించి ఆయా ప్రాజెక్టులపై ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను మంజూరు చేయాలని కోరారు.