నాగార్జున సాగర్‌లో బండి సంజయ్ పాదయాత్ర

నాగార్జున సాగర్‌లో బండి సంజయ్ పాదయాత్ర
  • సాగర్‌లో 20 నుంచి సంజయ్ పాదయాత్ర
  • బై ఎలక్షన్‌పై గ్రౌండ్ వర్క్ షురూ

హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దుబ్బాక బై ఎలక్షన్లో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధించిన మంచి ఫలితాలతో ఊపు మీదున్న ఆ పార్టీ సాగర్ బై ఎలక్షన్లో ఎలాగైనా గెలిచి ప్రభుత్వ వ్యతిరేకతను మరోసారి రుజువు చేయాలని కసిగా ఉంది. ఇప్పటికే షెడ్యూల్ రావడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. టికెట్ ఎవరికి ఇవ్వాలన్న అంశంపై ఇంటర్నల్గా కసరత్తు చేస్తోంది. ఈ ఎలక్షన్కు నెల రోజుల్లోపే టైమ్ ఉండడంతో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేసేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేరుగా ప్రజల్లోకి పోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిసైడ్ అయ్యారు. మొదటి విడతలో పెద్దవూర, త్రిపురారం, తిరుమలగిరి సాగర్ మండలాల్లో పాదయాత్ర చేసేందుకు ఆయన ప్లాన్ చేసుకున్నారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర నేతలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో చర్చించి, పాదయాత్ర ప్రారంభించే తేదీని, ప్రాంతాలను ఖరారు చేశారు. అక్కడ గెలుపు కోసం పార్టీ నాయకులంతా కలిసి కట్టుగా పని చేయాలని, టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ గెలుపే లక్ష్యంగా శ్రమించాలని వారికి సంజయ్ సూచించారు. టికెట్ విషయంలో సర్వే ఆధారంగానే ప్రజల్లో పట్టు ఉన్న నేతను హైకమాండ్ ఖరారు చేస్తుందని వారితో సంజయ్ చెప్పిన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకే ఇవ్వాలంటూ ఈ సందర్భంగా పలువురు సాగర్ నేతలు బండి సంజయ్ని కోరారు. టికెట్ రేసులో ఉన్న కడారి అంజయ్య యాదవ్, కంకణాల నివేదితా రెడ్డిలు ఆయనను కలిసి తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడిగారు. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతనే తమ అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే బీజేపీ అభ్యర్థిపై హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకోనుంది.
 

బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత పాతూరి సుధాకర్ రెడ్డి

మేడ్చల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు పాతూరి సుధాకర రెడ్డి బీజేపీలో చేరారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. మేడ్చల్ జిల్లాలో బీజేపీ నేతలు కూన శీశైలం గౌడ్, కొంపల్లి మోహన రెడ్డి ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సుధాకర రెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు.