బీజేపీ గెలిస్తే ఈ పాటికే కేసీఆర్‌‌ను జైలులో వేసేవాళ్లం: బండి సంజయ్

బీజేపీ గెలిస్తే ఈ పాటికే కేసీఆర్‌‌ను జైలులో వేసేవాళ్లం: బండి సంజయ్

కరీంనగర్/రాజన్నసిరిసిల్ల, వెలుగు : ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసులో దొరికిపోతానన్న భయంతో ఇంటెలిజెన్స్‌‌‌‌ వద్ద ఉన్న డేటాను ధ్వంసం చేసిన కేసీఆర్‌‌‌‌ను ఎందుకు అరెస్ట్‌‌‌‌ చేయడం లేదని కరీంనగర్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ బండి సంజయ్‌‌‌‌ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికే కేసీఆర్‌‌‌‌ను జైల్లో వేసేవాళ్లమన్నారు. ప్రధాని మోదీ లేని దేశాన్ని ఊహించుకోలేమని, మోదీ మళ్లీ ప్రధాని కాకుంటే భారత్‌‌‌‌ మరో పాకిస్తాన్‌‌‌‌లా మారే ప్రమాదం ఉందన్నారు. పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కరీంనగర్‌‌‌‌లో నిర్వహించిన మహా బైక్‌‌‌‌ర్యాలీకి గోషామహల్‌‌‌‌ ఎమ్మెల్యేతో పాటు బండి సంజయ్‌‌‌‌ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ తరఫున పోటీ చేస్తున్న క్యాండిడేట్లు ఎన్నడైనా ప్రజలను కలిశారా ? ప్రజల పక్షాన పోరాటాలు చేశారా ? అని ప్రశ్నించారు. తాను రైతులకు అండగా నిలిచానని, ఆర్టీసీ కార్మికుల కోసం కొట్లాడానని, ఉద్యోగుల కోసం జైలుకు సైతం పోయానని గుర్తు చేశారు. జవాన్లను అవమానించేలా సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, తన నోటి నుంచి హిందుత్వం గురించి మాట్లాడనని, కాషాయ జెండాను పట్టుకోనని చెప్పారు. వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌ ఓడిపోతే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీని మూసేసి ఫాంహౌజ్‌‌‌‌కే పరిమితం అవుతరా  అని కేసీఆర్‌‌‌‌కు సవాల్‌‌‌‌ విసిరారు.

 ఏబీసీ గ్యాంగ్‌‌‌‌ (ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్) తనను ఏమీ చేయలేదన్నారు.  సిరిసిల్లలో నిర్వహించిన బైక్‌‌‌‌ ర్యాలీలో మాట్లాడుతూ ‘నేను పక్కా లోకల్..  కాంగ్రెస్, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్లు నాన్‌‌‌‌ లోకల్‌‌‌‌, కరీంనగర్ పార్లమెంట్ బిడ్డను కావడం, హిందువుగా పుట్టడం నా అదృష్టం’ అని చెప్పారు. గాడిద గుడ్డు పెట్టదు.. కాంగ్రెస్‌‌‌‌ ఆరు గ్యారంటీలను అమలు చేయదని ఎద్దేవా చేశారు. ప్రధాని అభ్యర్థే లేని పార్టీకి ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు. జై శ్రీరాం అనొద్దు అని చెప్పిన కేటీఆర్‌‌‌‌ తన పేరులో రాముడు పదాన్ని తొలగించుకోవాలన్నారు. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.