బీజేపీ అధికారంలోకి రాగానే బ్లడ్ టెస్టులు చేసుడే

బీజేపీ అధికారంలోకి రాగానే బ్లడ్ టెస్టులు చేసుడే
  •  టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు డ్రగ్స్ వాడుతున్నారు

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొందరు వారి గ్లామర్ కాపాడుకోవడానికి డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే వారికి రక్త పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం శివంపేటలో ప్రెస్ మీట్ లో పాల్గొని మాట్లాడారు బండి.

తన భాషను అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారని.. భాష విషయంలో కేసీఆరే తన గురువని అన్నారు బండి సంజయ్. బీజేపీతో తప్ప అన్ని పార్టీలతో కలిసి టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిందని విమర్శించారు. కేసీఆర్ కెప్టెన్ అయితే.. ఒవైసీ వైస్ కెప్టెన్ అని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్స్ ట్రా ప్లేయర్లు అని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం కేసీఆర్ కు వచ్చిందని.. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నాడని చెప్పారు. కేసీఆర్  మాటలు నమ్మి రైతులంతా సన్న వడ్లు పండించి నష్టపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్టేనని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.

మరోవైపు వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించి తీరుతామన్నారు. పండుగ జరుపుకునేందుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు బండి సంజయ్. హుస్సేన్ సాగర్ లోకి పరిశ్రమల జలాలు వస్తే కాని కాలుష్యం..వినాయక నిమజ్జనం జరిపితే వస్తుందా అని ప్రశ్నించారు. ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చెస్తామని తేల్చి చెప్పారు.