టీఆర్ఎస్ అంతానికి ఇదే చివరి పోరాటం

టీఆర్ఎస్ అంతానికి ఇదే చివరి పోరాటం

గడీల పాలనను బీజేపీ అంతం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. బండి సంజయ్‌ చేపట్టిన తొలివిడత ప్రజా సంగ్రామయాత్ర హుస్నాబాద్‌లో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పోరాటాల పురిటిగడ్డ హుస్నాబాద్ నుంచే సమర శంఖం పూరిస్తున్నామన్నారు. గాంధీ జయంతి సందర్భంగా.. వారి స్పూర్తితో అవినీతి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. బీజేపీ నాయకత్వంలో TRS అంతానికి ఇదే చివరి పోరాటం కావాలని ఉద్యమిస్తున్నామన్నారు. ఇంకెవరూ బలిదానాలు చేయొద్దని సూచించారు.

తెలంగాణకు కేంద్రం 2.91 లక్షల ఇండ్లను మంజూరు చేస్తే ..ఏ ఊరు వెళ్లినా ఇండ్లు లేవనే చెబుతున్నాని అన్నారు బండి సంజయ్ . చీమలు, పాములు, పక్షులకు కూడా గూడు ఉంటుంది కానీ..నా తెలంగాణ ప్రజలకు ఉండటానికి ఇల్లు లేదని నా అక్కలు చెల్లెళ్లు ఏడుస్తున్నారని తెలిపారు. ధరణి TRS కు భరణిగా మారితే...పేదలకు దయ్యంలాగా మారిందన్నారు. ధరణి బాధితులకు, నిర్వాసితులకు నేను బ్రాండ్ అంబాసిడర్ ను అని అన్నారు బండి సంజయ్.

ప్రజా సంగ్రామయాత్ర 36 రోజుల పాటు 8 జిల్లాలు, 19 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో తిరిగానని..ఎక్కడికి వెళ్లినా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని తెలిపారు బండి. మాట్లాడితే ధనిక రాష్ట్రమని కేసీఆర్ అంటున్నారు.. నిజంగా ధనిక రాష్ట్రమైతే ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వడం లేదు.. 22 వేల మంది స్వచ్ఛ కార్మికులకు వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదు? వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, విద్యా వలంటీర్లను,స్టాఫ్ నర్సులను ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు.