వాక్సిన్ కొంటానన్న డబ్బుతో రైతులకు సాయం చెయ్

వాక్సిన్ కొంటానన్న డబ్బుతో రైతులకు సాయం చెయ్

వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని గట్టు దుద్దెన పల్లి, చెంజెర్ల గ్రామాల రైతులను కలిసిన ఆయన.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో వడగళ్ల వానకు పంటలు నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక వానలకు దెబ్బతిన్న రైతులను ఎప్పుడైనా ఆదుకున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆదుకునే ఫసల్ బీమా ఇక్కడ అమలు చేయడం లేదని విమర్శించారు. వేల కోట్ల రూపాయల భూములు అమ్ముతున్న కేసీఆర్.. ఆ డబ్బులతో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తోందన్న బండి సంజయ్.. ఫ్రీగా వ్యాక్సిన్ కొంటానని చెప్పిన కేసీఆర్.. ఆ సొమ్ము రైతుల కోసం ఖర్చు చేయాలన్నారు. పంటలు అమ్ముకున్న రైతులకు డబ్బులు ఖాతాలో పడేవరకు నమ్మకం ఉండటం లేదన్నారు. వానలకు నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం అందించాలన్నారు.