బీజేపీని చూసి.. కేసీఆర్​ వణుకుతుండు

బీజేపీని చూసి.. కేసీఆర్​  వణుకుతుండు
  • అందుకే ఢిల్లీకి పోయి కూర్చుండు: బండి సంజయ్
  • కేసీఆర్ పరిస్థితి ‘ఊపర్ షేర్వానీ, అందర్ పరేషానీ’ లెక్క ఉంది
  • నయా నిజాం పాలనను కూకటి వేళ్లతో పెకిలించేందుకే పాదయాత్ర
  • అరెస్టులు, జైళ్లకు భయపడం కేఆర్ఎంబీ మీటింగ్​కు కేసీఆర్​
  • ఎందుకు వెళ్లడం లేదు? ఓల్డ్ సిటీని హైటెక్ సిటీగా  ఎందుకు మార్చలేదు..? 
  • టీఆర్ఎస్, -ఎంఐఎంలను ముస్లింలు నిలదీయాలె
  • ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ స్టేట్​ చీఫ్​ పిలుపు
  • కేసీఆర్, జగన్, మేఘా కృష్ణారెడ్డి తెలంగాణను దోచుకుంటున్నరు: వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: తమ పార్టీని చూసి సీఎం కేసీఆర్ గజగజ వణుకుతున్నాడని, అందుకే ఢిల్లీకి పోయి కూర్చున్నాడని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు ‘ఊపర్ షేర్వానీ, అందర్ పరేషానీ’ అన్నట్లుగా ఉందని దుయ్యబట్టారు. ప్రధాని మోడీతోపాటు మరికొందరు కీలక నేతలను కలిసి.. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే తప్పుడు సంకేతాలను పంపుతున్నాడని, ప్రజలను నమ్మించే కుట్ర చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. బీజేపీకి టీఆర్ఎస్‌‌‌‌తో ఎప్పుడూ దోస్తీ ఉండదని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్‌‌తో కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేసినయ్ తప్ప.. బీజేపీ ఏనాడూ కలిసి పోటీ చేయలేదని స్పష్టం చేశారు. ఏడో రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు.రాష్ట్రంలో నియంత, అవినీతి, నయా నిజాం పాలనను కూకటి వేళ్లతో పెకిలించేందుకే పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. 

కేసీఆర్ మాట్లాడితే కాళేశ్వరం అంటడు. రీ డిజైన్ పేరుతో అంచనాలు పెంచి దోచుకోవడం తప్ప నీళ్లు తీసుకురాలేదు. ఈ మూర్ఖుడు ఆనాడు చంద్రబాబు, జగన్​తో కుమ్మక్కయ్యాడు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 555 టీఎంసీల నీరు రావాల్సి ఉంటే.. కేవలం 299 టీఎంసీల నీటికే అంగీకరించి తెలంగాణ నోట్లో మట్టి కొట్టి చరిత్రలో దుర్మార్గుడుగా కేసీఆర్ నిలిచాడు. కేఆర్​ఎంబీ మీటింగ్‌‌ను బాయ్ కాట్ చేస్తే నిన్ను, టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు బహిష్కరించక తప్పదు.
 ‌‌                                                                                                                                                                                       ‑ వికారాబాద్​ సభలో బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ 

‘‘ప్రధాని మోడీని కలిసి కేసీఆర్ బయటకు రావడమే ఆలస్యం.. శభాష్ కేసీఆర్ అని మోడీ మెచ్చుకున్నట్లుగా, కేసీఆర్ తో మోడీ మనసు విప్పి మాట్లాడినట్లుగా మీడియాకు లీకులిస్తూ అబద్దపు వార్తలు రాయించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కోతల రాయుడైన కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు. ప్రధాని.. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి. ఏ సీఎం వెళ్లినా కలిసి సమస్యలు వింటరు. అందులో భాగంగానే కేసీఆర్ ను కలిసి మాట్లాడారు. అంతే తప్ప టీఆర్ఎస్‌కు బీజేపీ దగ్గర కావడమనేది ఉండదు” అని సంజయ్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా జరిపేదాకా బీజేపీ పోరాడుతుందన్నారు. రజాకార్ల పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు బీజేపీ మోకరిల్లితే.. నిజాం సమాధి ముందు మోకరిల్లిన నీచుడు కేసీఆర్ అని మండిపడ్డారు.
ప్రజల కోసం లాఠీదెబ్బలు తిన్నం
నియంత పాలనకు వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ బీజేపీ అని, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం లాఠీదెబ్బలు తిన్నది బీజేపీ కార్యకర్తలేనని బండి సంజయ్ అన్నారు. ‘‘కరోనా వస్తే టీఆర్ఎస్ నేతలు గడీల్లో సేదదీరారు. కాని మేం నరేంద్ర మోడీ పిలుపుతో ఇంటింటికీ తిరిగి పీపీఈ కిట్లు, మందు గోళీలు సహా చివరకు చెప్పులు కూడా కొనిచ్చినం’’ అని చెప్పారు. రాష్ట్రంలో గడీల పాలనను బద్ధలు కొడతామని అన్నారు. అరెస్టులు, జైళ్లకు భయపడే పార్టీ బీజేపీ కాదని, నక్సలైట్ల బుల్లెట్లకు భయపడకుండా చావుకు తెగించిన బీజేపీ కార్యకర్తలు అదే ధైర్యంతో టీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించే వరకు పోరాడతారని స్పష్టం చేశారు.
కేఆర్‌‌ఎంబీ మీటింగ్‌‌కు ఎందుకు పోట్లే?
 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు పిలిచినా హాజరుకాలేదని, పక్క రాష్ట్రం వాళ్లు ప్రాజెక్టులు కడుతుంటే కమీషన్లకు కక్కుర్తి పడి పట్టించుకోలేదని సంజయ్‌‌ దుయ్యబట్టారు. కేఆర్ఎంబీ మీటింగ్ కు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ‘‘ఎప్పుడూ ఫాంహౌజ్ లో, ప్రగతి భవన్ లో పడుకునే కేసీఆర్.. ఏనాడూ సీఎం హోదాలో రోజువారీ షెడ్యూల్ రిలీజ్ చేయలేదు. దేశంలో అలాంటి ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే. హుజూరాబాద్ ఎన్నికలు రాగానే బయటకొచ్చి.. మళ్లీ కథలు చెబుతుండు. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా, తలకిందకు, కాళ్లు పైకి పెట్టినా అక్కడ గెలిచేది బీజేపీ మాత్రమే” అని ధీమా వ్యక్తం చేశారు. 
ఆ కిటుకు ఏందో రైతులకు చెప్పరాదె
గొర్లు, బర్లు, చేపలు ఇచ్చి కోటీశ్వరులను చేస్తానని కేసీఆర్ కథలు చెబుతుండని బండి సంజయ్ విమర్శించారు. ‘‘ఫాంహౌజ్ లో ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తుండా.. అదెట్ల? గంజాయి పండిస్తుండా? కోటి రూపాయల కిటుకు ఏందో రైతులకు కేసీఆర్ చెప్పాలి” అని డిమాండ్ చేశారు. ‘‘పాతబస్తీలో ముస్లిం యువకులకు ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు? అక్కడికి మెట్రో రైలు ఎందుకు రావడం లేదు? ఓల్డ్ సిటీని హైటెక్ సిటీగా ఎందుకు మార్చలేదు? పెద్ద కంపెనీలు  ఓల్డ్ సిటీకి ఎందుకు రావడం లేదు? వీటిపై పాతబస్తీ ప్రజలు ఇప్పుడిప్పుడే ఆలోచన చేస్తున్నారు. టీఆర్ఎస్, -ఎంఐఎంలను నిలదీయాలి” అని ఆయన పిలుపునిచ్చారు. కాగా, బండి సంజయ్ చేస్తున్నది పాదయాత్ర మాత్రమే కాదని, తెలంగాణలోని ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరు నడుం బిగించి కదిలి వస్తున్న ప్రజా యాత్ర అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. గతంలో ఫాంహౌజ్ దాటని సీఎం కేసీఆర్, హుజూరాబాద్ ఎన్నికలు రాగానే బయటకు వచ్చిండని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, బడా కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్ ఓ మోసగాడు. ఎన్నికలుంటేనే అడ్డగోలుగా హామీలు ఇస్తాడు. ఎన్నికలు అయిపోగానే వాటిని మరచిపోతాడు. ఇది కేసీఆర్ నైజం” అని మండిపడ్డారు. తెలంగాణలో రూ.లక్ష కోట్లకు పైగా సంపాదించిన వాళ్లు ఇద్దరు మాత్రమే ఉన్నారని, వారిలో ఒకరు కేసీఆర్ కాగా, రెండో వ్యక్తి మేఘా కృష్ణారెడ్డి అని ఆరోపించారు. కాళేశ్వరం రూ.36 వేల కోట్ల ప్రాజెక్టుకు కాగా.. రూ.లక్ష కోట్ల అంచనాలకు పెంచిండని ఫైర్ అయ్యారు. పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టులోనూ కేసీఆర్ అవినీతి దందా చేస్తుండని విమర్శించారు. కేసీఆర్ అవినీతిని ఎండగట్టడంతోపాటు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని వివేక్ చెప్పారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసి కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు హామీలు ఇస్తున్నారన్నారు. ‘‘నేను చేయించిన సర్వేలో ఈటల రాజేందర్ కు 70 శాతానికి పైగా ప్రజలు మద్దతు తెలిపారు” అని  వివేక్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపించి తీరుతామని హెచ్చరించారు.