సమైక్య పాలనను మించిన అవినీతి

సమైక్య పాలనను మించిన అవినీతి
  • సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: సమైక్య పాలనను మించిన అవినీతి తెలంగాణలో రాజ్యమేలుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ టీఆర్ఎస్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. కుటుంబ, అవినీతి, నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారని ధ్వజమెత్తారు. దీంతో తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీజేపీని ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఆదరిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి నిలదీయాలని.. త్వరలో జిల్లా, మండల స్థాయి పార్టీ నేతలకు శిక్షణ ఇవ్వనున్న పార్టీ ట్రైనర్స్ మీటింగ్ లో సంజయ్ దిశా నిర్దేశం చేశారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసు నుంచి వర్చ్యువల్ పద్దతిలో జరిగిన ఈ కార్యక్రమంలో సంజయ్ మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో మించిన అవినీతి కేసీఆర్ పాలనలో జరుగుతుందని, దీన్ని ఎక్కడికక్కడ ప్రజల్లో నిలదీయాలని క్యాడర్ కు సూచించారు. ఇటీవల ప్రజా సంగ్రామ యాత్రకు వచ్చిన ఆదరణే ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతోపాటు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీల అమలు కోసం జనం మధ్యకు వెళ్లాలని, వారికి అండగా నిలువాలని పిలుపునిచ్చారు. 

ఈ పాలనపై ప్రజలు విసిగిపోయారు
ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా కేంద్రంలో మోడీ పాలన సాగుతోందని ఇది బీజేపీకి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గర్వకారణమన్నారు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో అవినీతి కొనసాగిందని, ఇప్పుడు కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని, ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా చూస్తున్నారని, బీజేపీకి అవకాశం ఇస్తే పేదలకు న్యాయం జరుగుతుందని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావనలో జనం ఉన్నారని చెప్పారు. ఎందరో నాయకుల కృషి వల్లే రాష్ట్రంలో  బీజేపీ అధికారంలో వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు బీజేపీ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లోని కాటేదాన్ మహావీర్ కాలేజీలో జరుగనున్నాయి. ఉచిత రేషన్ పథకం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను వచ్చే ఏడాది మార్చి దాకా పొడిగిస్తూ ప్రధాని నిర్ణయం గొప్పదని సంజయ్‌ అన్నారు.