సీఎం ఎగ్గొట్టిన హామీలపై ఇంటింటికీ పోతం

సీఎం ఎగ్గొట్టిన హామీలపై ఇంటింటికీ పోతం
  • ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటం: సంజయ్‌
  • అన్నింటినీ ఫైల్‌ చేసి కేసీఆర్‌కు పంపిస్తం
  • బీసీ బంధు, గిరిజన బంధు కూడా అమలు చేయాలె
  • రుణమాఫీ అప్పుడు లక్ష అని.. ఇప్పుడు 50 వేలు అంటున్నరు
  • కరీంనగర్‌లో ‘బీజేపీ దరఖాస్తుల ఉద్యమం’ షురూ

కరీంనగర్‍ సిటీ/కొండగట్టు, వెలుగు: ‘సీఎం కేసీఆర్‌‌ ఎగ్గొట్టిన హామీలపై ఇంటింటికీ వెళ్తం. హామీల అమలుకు సర్కారుపై ఒత్తిడి తెచ్చేలా ప్రజలను నుంచి దరఖాస్తులు తీసుకుంటం. త్వరలో చేపట్టబోయే ప్రజా సంగ్రామ యాత్రలోనూ దారి పొడవునా అప్లికేషన్లు స్వీకరిస్తం. అన్నింటినీ సర్కారుకు పంపిస్తం’ అని  బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌ బండి సంజయ్‌‌ చెప్పారు. పార్టీ కరీంనగర్‌‌ జిల్లా శాఖ చేపట్టిన ‘బీజేపీ దరఖాస్తుల ఉద్యమం’ను సోమవారం కరీంనగర్‌‌లో సంజయ్‌‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దరఖాస్తుల ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.

దరఖాస్తులను కంప్యూటరీకరించాలె
ప్రతి పంచాయతీ, మండల, మున్సిపల్, కలెక్టర్ కార్యాలయాల వద్ద బీజేపీ, బీజేవైఎం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కిసాన్, మహిళా మెర్చాల విభాగాలు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సంజయ్‌‌ పిలుపునిచ్చారు. దరఖాస్తులను షెడ్యూల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ సహా సీఎం కార్యాలయాల్లో అందజేస్తామని చెప్పారు. ప్రజలు తమ ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలనూ జత చేసేలా అవగాహన కల్పించాలని, దరఖాస్తు తీసుకున్న వాళ్లకు రశీదు కూడా ఇవ్వాలని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణలో పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కొందరు లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేసే ప్రమాదం ఉందని, వాటికి తావులేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించి భద్రపరచాలని, అన్నింటినీ అక్టోబర్ 2 తర్వాత సీఎంకు అందజేస్తామని చెప్పారు. దరఖాస్తు ఫాం నమూనాను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాలన్నారు. 

రుణ మాఫీ పూర్తిగా అమలు చేయాలె
రూ. లక్ష లోపు రైతుల రుణాలను మాఫీ చేస్తానన్న సీఎం ఇప్పుడు రూ. 50 వేల లోపు మాఫీ చేస్తామంటున్నారని, పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలుకు రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటామని సంజయ్‌‌ చెప్పారు. డబుల్‌‌ బెడ్రూం ఇండ్లు, స్థలం ఉన్నవారికి  ఇంటి నిర్మాణం కోసం రూ. 5 నుంచి రూ. 6 లక్షలు మంజూరు చేస్తామన్నారని, గూడు లేని పేదలందరి నుంచి దరఖాస్తులు తీసుకుంటామన్నారు. దళిత, గిరిజన కుటుంబాలకు మూడెకరాల పొలం ఇస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని, 2018 అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ చెప్పారని, దీనిపైనా అప్లికేషన్లు తీసుకుంటామని చెప్పారు.  

నిరుద్యోగులకు లక్ష చొప్పున ఇయ్యాలె
దళిత బంధును హుజూరాబాద్‌‌లోనే అమలు చేసి వేరే చోట అమలు చేయకపోవడం దళితులను మోసం చేయడమేనని సంజయ్‌‌ అన్నారు. సీఎంకు అంబేద్కర్‌‌పై గౌరవముంటే, దళితుల పట్ల ప్రేమ ఉంటే దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ అమలు చేయాలన్నారు. బీసీ బంధు, గిరిజన బంధు కూడా తీసుకొచ్చి 60 లక్షల మంది బీసీ కుటుంబాలు, 10 లక్షల గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందించాలని డిమాండ్‌‌ చేశారు. నిరుద్యోగులకు 2018లో ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం ప్రతి నెలా రూ. 3,116 పంపిణీ చేయాలన్నారు. 2018 నుంచి ఇప్పటివరకు బకాయిల కింద ఒక్కో నిరుద్యోగికి లక్ష రూపాయల చొప్పున వాళ్ల అకౌంట్లలో వేయాలని డిమాండ్‌‌ చేశారు.

కొండగట్టులో సంజయ్‌‌
రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతిని అంతానికి ఈ నెల 24 నుండి ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నట్లు సంజయ్ చెప్పారు. సోమవారం కుటుంబ సమేతంగా కొండగట్టు అంజన్నను దర్శించుకొని బేతాళునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24న హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి యాత్ర స్టార్ట్‌‌ చేస్తామని చెప్పారు. యాత్రలో స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.

బండారం బయటపడ్తదనే మీడియాను రానీయలె: సంజయ్‌
హైదరాబాద్, వెలుగు: సీఎం హుజూరాబాద్ సభకు మీడియాను అనుమతించకపోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సీఎం బండారం బయటపడుతుందనే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. గతంలో సిరిసిల్లలో కేసీఆర్ సభకూ ఇలానే అనుమతించలేదన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అధికార బలంతో మీడియా గొంతు నొక్కుతారేమో గానీ ప్రజల గొంతు నొక్కలేరన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు టీఆర్ఎస్‌కు కర్రు కాల్చి వాతపెడ్తారని అన్నారు. 

బీజేపీ స్టేట్ ఆఫీసులో వాజ్‌పేయి వర్ధంతి 
మాజీ ప్రధాని వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ నేతలు ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి వాజ్‌పేయి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలు మనోహర్‌రెడ్డి, ఎన్వీ సుభాష్, ఎస్ కుమార్, సంగప్ప, సుధాకర్ శర్మ పాల్గొన్నారు.