
‘ఎందరో కార్యకర్తల ప్రాణ త్యాగాల వల్లే బీజేపీ ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. వారి లక్ష్య సాధనకు ప్రతి కార్యకర్త పని చేయాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వచ్చే 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ద్యేయంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీసులకు, అరెస్టులకు భయపడే కార్యకర్తలు బీజేపీకి అవసరం లేదని ఆయన అన్నారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ బీజేవైఎం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
‘గోల్కొండ కోటను చూస్తే దాని మీద కాషాయ జెండానే మనకు కనిపించాలి. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు.. అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ కుటుంబం చేరి దోచుకుంటుంది. రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన సాగుతోంది. అవినీతి, రజాకార్ పాలన కొనసాగుతోంది. రాక్షస పాలన నుంచి విముక్తి కోసం యువమోర్చా పోరాటం చేయాలి. వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు ఉండదు. ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తోంది. టీఆర్ఎస్‌తో పొత్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటేనే ఈ ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్‌లు గుర్తుకు వస్తాయి. ఈ ప్రభుత్వం కార్పోరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం తీసుకున్న నిర్ణయం బాధ కలిగించింది. పైసలు వెదజల్లి టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ ఎక్కడా విజయోత్సవాలు జరుపుకోలేదు. ఎలా గెలిచారో వారికి తెలుసు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటుందనే నమ్మకం లేదు. ప్రభుత్వాన్ని హెచ్చరించడానికే నాగార్జున సాగర్‌లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇచ్చాం. భయపడే కార్యకర్తలు బీజేపీకి అవసరం లేదు. టీఆర్ఎస్ అరాచకం స్టార్ట్ అయింది. పోలీసులకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుంది. బైంసాలో రిపోర్టర్లపై దాడి చేసింది హిందు వాహిని కార్యకర్తలని ఓ పోలీస్ అధికారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి చెప్పాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఐపీఎస్ అధికారిని చూసి హిందువులు నవ్వుకుంటున్నారు. సంఘ విద్రోహ శక్తులకు ఈ ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. కోవిడ్‌ని ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ప్రజల్ని కాపాడాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు’ అని బండి సంజయ్ అన్నారు.