ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా వదలం

ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా వదలం
  •    ఇంకా 20 రోజులే టైం ఉంది
  •     కోడ్​వచ్చేలోపే అమలు చేయాలి
  •     ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ 

కమలాపూర్, వెలుగు: వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని, ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా వదిలేది లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్​తో పాటు ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో  శుక్రవారం రెండో విడత ప్రజాహిత యాత్ర  కొనసాగించారు. ఈ సందర్భంగా కమాలాపూర్ లో మాట్లాడుతూ పదేండ్లలో బీఆర్ఎస్ ఒక్క  రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ కూడా ఇప్పటికీ  కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపానపోలేదన్నారు. మహిళలకు రూ.2500,  రూ.4 వేల పెన్షన్, రూ.15 వేల రైతు బంధు, రూ.2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, రూ.5 లక్షల నగదు సాయం ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లు ప్రాజెక్టుల పేరుతో రాజకీయం చేస్తున్నారని సంజయ్ ఫైర్ అయ్యారు.

కాళేశ్వరం పేరుతో దోచుకున్న కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని, అతడి కుటుంబ ఆస్తులను ఎందుకు స్వాధీనం పర్చుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ 2 నెలల్లోనే రూ.10 వేల కోట్ల అప్పు చేసి భవిష్యత్ తరాలపైనా భారం మోపుతోందన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ పెట్టిన గడువు మరో 20 రోజులే ఉందని, త్వరలోనే ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు కట్కూరి అశోక రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూపతి ప్రవీణ్ కుమార్, లీడర్లు ఈటల భద్రయ్య తుమ్మ శోభన్, మాట్ల రమేశ్, పుస్కూరి రాంబాబు పాల్గొన్నారు.