పార్లమెంట్ సెషన్​ తర్వాత సంజయ్ పాదయాత్ర

పార్లమెంట్ సెషన్​ తర్వాత సంజయ్ పాదయాత్ర

హైదరాబాద్, వెలుగు: రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 27 నుంచి ప్రారంభించేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ ప్రిపేర్ అవుతోంది. అయితే పార్టీ కేంద్ర నాయకుల అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఈనెల 17 నుంచి 20 మధ్యలో రెండో విడత యాత్ర ఉంటుందని పోయిన నెలలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. అయితే, పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుండడంతో ఇది తాత్కాలికంగా వాయిదా పడింది. ఈనెల 23 వరకు సమావేశాలు ఉండడం, 25న క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఈనెల 27 నుంచి యాత్ర ప్రారంభించాలని సంజయ్ భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పాదయాత్ర కమిటీ పర్యవేక్షిస్తోంది. యాత్ర ఏర్పాట్లు, సక్సెస్ చేయడం వంటి అంశాలపై పార్టీ స్టేట్ ఆఫీసులో కమిటీ సమావేశమై చర్చిస్తోంది. దక్షిణ తెలంగాణలో రెండో విడత యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో యాత్ర ప్రారంభించేందుకు పాదయాత్ర కమిటీ రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్‌తో సంజయ్ ఒకటి, రెండు రోజుల్లో దీనిపై చర్చించి, యాత్ర తేదీలను ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.