హిందువులపై దాడిచేసినోళ్లను వదలం : బంగ్లా ప్రభుత్వం

హిందువులపై దాడిచేసినోళ్లను వదలం : బంగ్లా ప్రభుత్వం

ఢాకా: బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు చేసేవారిని వదిలిపెట్టబోమని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం చేసింది. మైనార్టీలపై దాడిచేసే, వేధించే వారిపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. సెక్రటేరియెట్​లో ఇంటర్నేషనల్​ సొసైటీ ఫర్​ క్రిష్ణ కాన్సియస్​నెస్ (ఇస్కాన్​) బంగ్లాదేశ్​తో కొత్తగా నియమితులైన ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ సలహాదారు బ్రిగేడియర్​ జనరల్​ (రిటైర్డ్​) ఎం. సఖావత్​ హుస్సేన్​ సమావేశమయ్యారు. కాగా, దేశంలో మైనార్టీల భద్రతకు చర్యలు తీసుకోవాలని హుస్సేన్​ను ఇస్కాన్​ ప్రెసిడెంట్​ సత్యరంజన్​బరోయ్​ కోరారు. 

భద్రతా చట్టాలు రూపొందించాలని, మైనార్టీ సెల్, కమిషన్​ను ఏర్పాటు చేయాలని విన్నవించారు. మొత్తం 8 ప్రతిపాదనలను ఆయన ముందుంచారు. ఈ విషయాల్లో తన పూర్తి మద్దతు ఉంటుందని హుస్సేన్​ వారికి హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్​ మతసామరస్య దేశమని, ఇక్కడ మొదటినుంచి అన్ని మతాల ప్రజలు ఎలాంటి విభేదాలు లేకుండా  కలిసి మెలిసి పెరిగారని తెలిపారు. దేశంలో హింస, సంఘర్షణ, ద్వేషానికి తావులేదని పేర్కొన్నారు. మైనార్టీల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

మోదీకి బంగ్లాదేశ్​ చీఫ్​ అడ్వైజర్​ ఫోన్​

భారత ప్రధాని మోదీకి తాజాగా బంగ్లాదేశ్​ చీఫ్​ అడ్వైజర్ మహ్మద్​ యూనస్​ ఫోన్​ చేశారు. దేశంలో హిందువులకు రక్షణ కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్​ యూనస్ నుంచి ఫోన్‌‌‌‌కాల్ వచ్చింది. అక్కడి పరిస్థితిపై ఇద్దరం చర్చించాం.  ప్రజాస్వామిక, సుస్థిర, శాంతియుత, ప్రగతశీల బంగ్లాదే‌‌‌‌శ్‌‌‌‌కు భారత్ మద్దతు ఉంటుందని చెప్పా. బంగ్లాదేశ్​లోని హిందువులు, మైనారిటీలకు భద్రత, రక్షణ కల్పిస్తామని యూనస్​
హామీ ఇచ్చారు'' అని మోదీ తెలిపారు.