హసన్ అదుర్స్...ఉత్కంఠ పోరులో టీమిండియాపై బంగ్లా గెలుపు

హసన్ అదుర్స్...ఉత్కంఠ పోరులో టీమిండియాపై బంగ్లా గెలుపు

టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ సాధించింది. ఉత్కంఠ పోరులో 1 వికెట్ తేడాతో గెలిచింది. మొదట భారత్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన బంగ్లా.. ఆ తర్వాత 187 పరుగుల లక్ష్యాన్ని 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివర్లో మెహదీ హసన్.. ఒంటరి పోరాటం చేసి బంగ్లాను గెలిపించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్లో బంగ్లాదేశ్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. 

దాసు ఒక్కడే..

187 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లా.. ఖాతా తెరవకుండానే తొలి వికెట్ నష్టపోయింది. నజ్ముల్ హొస్సేన్ శాంటో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అనాముల్ హాక్ 14 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. దీంతో బంగ్లాదేశ్ 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో లిట్టన్ దాస్ జట్టును ఆదుకున్నాడు. షకీబుల్ అలీ హసన్తో కలిసి మూడో వికెట్ కు 47 పరుగులు జోడించారు. అయితే 74 పరుగుల వద్ద బంగ్లా మూడో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసి లిట్టన్ దాస్ను వాషింగ్టన్ సుందర్ బుట్టలో వేసుకున్నాడు. ఈ స్థితితో షకీబుల్ అలీ హసన్, ముష్ఫికర్ రహీం, మహమ్మదుల్లా కొద్దిసేపు పోరాడారు. కానీ.. వికెట్ల పతనాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు.

హసన్ అదుర్స్..

136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచిన బంగ్లాను మెహదీ హసన్ అద్భుత బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. ముస్తఫిజుర్ రహమాన్ తో కలిసి జట్టుకు విలువైన పరుగులు చేశాడు. చెత్త బంతులను బౌండరీలు, సిక్సులుగా మలిచాడు. చివరి వికెట్ కు ముస్తఫిజుర్ తో కలిసి సరిగ్గా 50 పరుగులు జోడించాడు. ఇదే క్రమంలో 39 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరుతో జట్టుకు విజయాన్ని అందించాడు.  చివరకు బంగ్లా 46 ఓవర్లలో 187 పరుగులు చేసి గెలుపొందింది.  భారత బౌలర్లలో సిరాజ్, కుల్దీప్ సేన్, వాషింగ్టన్ సుందర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

186కే ఆలౌట్..

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 41.2 ఓవర్లలో కేవలం 186 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన కొద్దిసేపటికే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 6వ ఓవర్‌లో ధావన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ సమయంలో రోహిత్ కు జతకలిసిన  కోహ్లీ.,.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. దీంతో టీమిండియా పవర్ ప్లేలో ఒక వికెట్ కోల్పోయి 48 పరుగులు సాధించింది. సాఫీగా సాగుతుందనుకున్న భారత్ను షకీబ్ అల్ హసన్ దెబ్బకొట్టాడు. 11వ ఓవర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(27),కోహ్లీ(9)లను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(24) కూడా ఔటవ్వడంతో భారత్ 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

రాహుల్ హాఫ్ సెంచరీ..

ఈ సమయంలో కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు. వాషింగ్టన్ సుందర్(19)తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో రాహుల్  అర్థసెంచరీ సాధించాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే ఈ సమయంలో షకీబ్ అల్ హసన్ మరోసారి మాయ చేశాడు. క్రీజులో కుదురుకున్న సుందర్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత 4 పరుగుల వ్యవధిలోనే షెహ్‌బాజ్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ పెవిలియన్ కు చేరారు.  క్రీజులోకి వచ్చిన సిరాజ్‌తో కేఎల్ రాహుల్ కాసేపు  పోరాడాడు. భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 70 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేసిన రాహుల్..అనాముల్ హక్కు క్యాచ్ ఇచ్చి  ఔటయ్యగా.. చివరి వికెట్‌గా 9 రన్స్ చేసిన సిరాజ్ వెనుదిరగడంతో భారత్ 186 పరుగులకే పరిమితమైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్‌హసన్ 5 వికెట్లు పడగొట్టాడు. ఇబాదత్ హోస్సెన్ 4 వికెట్లు సాధించాడు.  మెహ్‌దీ హసన్‌కు ఓ వికెట్ దక్కింది.