లాక్‌‌డౌన్‌‌ ముగిశాక బ్యాంకులకు అసలు సవాళ్లు

లాక్‌‌డౌన్‌‌ ముగిశాక బ్యాంకులకు అసలు సవాళ్లు

అన్ని సెక్టార్ల మాదిరే బ్యాంకింగ్‌ సెక్టార్‌ను లాక్‌డౌన్‌ కోలుకోని దెబ్బకొట్టిందని ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్ అసోసియేషన్‌ నేషనల్‌ సెక్రటరీ, సెంట్రల్‌ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ బీఎస్‌ రాంబాబు అన్నారు. లాక్‌డౌన్‌ తరువాత వీటికి మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఇది వరకే నష్టాలతో సతమతమవుతున్న ప్రభుత్వ బ్యాంకుల మొండిబకాయిలతోపాటు నష్టాలూ మరింత పెరుగుతాయని అన్నారు. కొత్త డిపాజిట్లు/ఇన్వెస్ట్‌మెంట్లు విపరీతంగా తగ్గుతాయన్నారు.  బ్యాంకులకు లాభాలు రాకున్నా, కనీసం నష్టాల నుంచి బయటపడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం పడాలని సూచించారు. ప్రస్తుతం బ్యాంకుల పరిస్థితిపై ‘వీ6 వెలుగు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను చెప్పారు. అవన్నీ ఆయన మాటల్లోనే…

బ్యాంకుల బిజినెస్‌ పెద్దగా పెరగదు

ఆర్‌బీఐ నిర్ణయాలతో బ్యాంకులకు లిక్విడిటీ పెరిగినా వ్యాపారం పెరగదు. కరోనాకు ముందు కూడా ఇండియా బ్యాంకింగ్‌ ఇండస్ట్రీ అండర్‌ క్యాపిటలైజ్డ్‌ సెక్టార్‌. మూలధనం ఇంకా పెరగాలి. 2018లో రూ.66 వేల కోట్ల నికర నష్టాన్ని బ్యాంకింగ్‌రంగం ప్రకటించింది. గత రూ.60 వేల కోట్ల నికర నష్టం వచ్చింది. ఇక లాక్‌డౌన్‌ తరువాత నష్టాలు ఇంకా పెరుగుతాయి. ఒకప్పుడు 9.4 శాతం నమోదైన జీడీపీ క్రమంగా తగ్గుతూ 4.3 శాతానికి చేరింది. ఇది 1.2 శాతానికి దిగజారుతుందని అంచనా. అందుకే ఈ ఏడాది బ్యాంకింగ్‌ సహా అన్ని రకాల ఇండస్ట్రీలు దెబ్బతింటాయి.   జీడీపీ బాగా తగ్గుతుంది…

ఈ ఏడాది మొత్తం కరోనా  ఉంటుందని కొందరు, జీవితాంతం ఉండొచ్చని మరికొందరు చెబుతున్నారు.  ఇండస్ట్రీలు ఇంతకాలం లాక్‌డౌన్‌లో ఎప్పుడూ ఉండలేదు. మన జీడీపీలో సర్వీస్‌ సెక్టార్‌ వాటా 50 శాతం, అగ్రికల్చర్‌ సెక్టార్‌ 2-0 శాతం వాటా ఉంటుంది. మిగిలినది ఇండస్ట్రీ సెక్టార్‌ నుంచి వస్తుంది. లాక్‌డౌన్‌ వల్ల ఇవన్నీ కుంటుపడ్డాయి కాబట్టి జీడీపీ పెరిగే అవకాశాలు లేవు. ఇండస్ట్రీలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. బాకీల వసూలు కావడం చాలా కష్టం. కరోనా వల్ల బ్యాంకులకు నష్టాలు ఎంత ఉండబోతున్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం కష్టం.

జనానికి నమ్మకం పెంచాలి.

కరోనా రాకముందే బ్యాంకులపై కస్టమర్లకు నమ్మకం పోయింది.  ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు వల్ల డిపాజిటర్‌ డబ్బుకు భద్రత ఉండదనే భయం పెరిగింది.  కస్టమర్ల నుంచి వ్యతిరేకత రావడంతో చివరికి బిల్లును విత్‌డ్రా చేసుకున్నారు. డిపాజిట్లపై ఐటీ ఆఫీసర్లు నిఘా వేసి వారిని ఇబ్బందులు పెడుడున్నారు. దీనివల్ల చాలా మంది బ్యాంకులకు దూరమవుతున్నారు. నాన్‌ బ్యాంక్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో, చిట్స్‌ వంటి వాటిలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. బ్యాంకుల విలీనం వల్ల చాలా బ్రాంచ్‌లు క్లోజ్‌ అయ్యాయి. రూల్స్ మారాయి. దీనివల్ల చివరికి ఎకౌంట్‌ హోల్డర్లే ఇబ్బందులు పడుతున్నారు. ఎఫ్‌ఆర్‌డీఐ వంటి బిల్లు మరొకటి వస్తుందని అంటున్నారు. అదే జరిగితే మరింత మంది బ్యాంకులకు దూరమవుతారు.

బ్యాంకులను సరిగా కలపలేదు

ఇటీవలి బ్యాంకుల విలీనంలో మాత్రం ఎన్నో లోపాలు ఉన్నాయి. నష్టాలు ఉన్న బ్యాంకులను లాభాలతో నడిచే బ్యాంకుల్లో కలిపేశారు. రూల్స్‌ ప్రకారం విలీనాలు జరగలేదు. ఈ పని పూర్తి కావడానికి దాదాపు రెండేళ్లు పట్టొచ్చు. చాలా బ్రాంచ్‌లు మూసేశారు. దీనివల్ల వాటి కస్టమర్లకు సమస్యలు వస్తున్నాయి. కొత్త రూల్స్ వల్ల అటు ఉద్యోగులు, ఇటు అకౌంట్‌ హోల్డర్లు తిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా ప్రమోషన్ల విషయంలో ఉద్యోగుల మధ్య గొడవలు జరగొచ్చు.   ఫలితంగా యాజమాన్యాలకే నష్టం జరుగుతుంది.  బ్యాంకుల విలీనంలో రాజకీయాలు జరిగినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆంధ్రా బ్యాంకు వంటి లాభదాయక బ్యాంకులు మూతపడ్డాయని సంఘాలు ఆరోపిస్తున్నాయి. మెర్జర్‌ తరువాత ఎస్‌బీఐ ఎన్‌పీఏలు రూ.2 లక్షల కోట్లకుపైగా పెరిగాయి.  చాలా మందికి వీఆర్‌ఎస్‌ ఇచ్చారు.

అప్పులు కట్టేవారికి ఇబ్బందులు ఉండకూడదు

లోన్లు రైటాఫ్‌  ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే! అయితే మనదేశంలో ధనిక డిఫాల్టర్లను వదిలేసి, పేదలను మాత్రమే బ్యాంకులు ఇబ్బందిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సంపన్నులు బ్యాంకుల అప్పులు ఎగ్గొట్టి విదేశాల్లో హాయిగా ఉంటున్నారు. ఎన్‌పీఏల విషయంలో ఎన్సీఎల్టీలకు వెళ్లాలి. అయితే రికవరీలు చాలా తక్కువగా ఉంటున్నాయి.

ఖాతాదారులకు అండగా ఉండాలి

పెద్దనోట్ల రద్దు (డీమానిటైజేషన్‌) తరువాత బ్యాంకులకు రావడానికి జనం భయపడు తున్నారు. కొత్త డిపాజిట్లు బాగా తగ్గుతు న్నాయి. డిపాజిట్లు/ఇన్వెస్ట్‌మెంట్లపై సీబీడీటీ నిఘా ఉండదు అని గవర్నమెంటు చెప్పడం లేదు.  కస్టమర్ల అనుమతి లేకుండా డబ్బులు వాడబోమని వారికి స్పష్టంగా చెప్పాలి. మంచి బారోవర్‌కు ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడదు. ప్రైవేటు బ్యాంకులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు రాకుండా ప్రభుత్వం చూసుకోవాలి.  కార్పొరేట్‌ మోసాల వల్ల పీఎస్‌యూ బ్యాంకులకు ఇబ్బందులు వస్తున్నాయి.

వడ్డీరేట్ల తగ్గింపు సాధ్యం కాకపోవచ్చు

పేదలకు, మిడిల్‌క్లాస్‌ జనానికి అప్పులు కావాలంటే ప్రభుత్వ బ్యాంకులే ఆధారం. అందుకే కరోనా కాలంలోనూ బ్యాంకులు పనిచేస్తున్నాయి. లోన్లను పెంచడానికి ఆర్‌బీఐ ఇటీవల వడ్డీరేట్లను తగ్గించింది. తగ్గిన వడ్డీరేట్లను కొన్ని బ్యాంకులు కస్టమర్లకు ఇవ్వడం లేదు. ఎందుకంటే వ్యాపారాలన్నీ మూతబడ్డాయి. ఇండస్ట్రీలు నడవడం లేదు. వ్యవసాయం కూడా కుంటుపడింది. ఎగుమ తులు నిలిచిపోయాయి. కొత్త డిపాజిట్లు బాగా తగ్గాయి. పాత అప్పుల వసూళ్లు కష్టమవుతు న్నాయి. నష్టాలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  ప్రస్తుతం బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.ఏడు లక్షల కోట్లు కాగా, ఇవి రూ.15 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా.