గడ్డి మందు తాగి కౌలు రైతు శంకర్ సూసైడ్

 గడ్డి మందు తాగి కౌలు రైతు శంకర్ సూసైడ్

కారేపల్లి, వెలుగు: అప్పుల బాధతో కౌలు రైతు సూసైడ్​ చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చింతల తండాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, తండాకు చెందిన బానోతు శంకర్(34) ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని నాలుగేండ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. నిరుడు వేసిన మిర్చి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు రూ.2.50 లక్షలకు పెరిగాయి. ఈ ఏడాది మిర్చి సాగు చేసి అప్పులు తీరుద్దామనుకున్నాడు. ఐదెకరాల్లో మిర్చి వేసేందుకు నారు పోశాడు. నారుకు కూడా వైరస్‌‌‌‌ సోకడంతో పూర్తిగా పాడైపోయింది. అప్పు చేసి నర్సరీల్లో మిరప నారు కొందామనుకున్నా.. ఎక్కడా అప్పు పుట్టలేదు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక, తీవ్ర మనస్తాపానికి గురై శంకర్‌‌‌‌‌‌‌‌.. ఆదివారం సాయంత్రం పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.