ముంబై సే చలా గయా దోస్త్​

ముంబై సే చలా గయా దోస్త్​

ఆనా జానా చలా రహేగా అప్న హి నామ్ రహ్ జాయెగా..అని గిరఫ్తార్ సినిమాలో అమితాబ్ బచ్చన్...కమల్ హాసన్ కోసం తన గొంతుతో అద్భుతంగా పాట పాడిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, సింగర్ బప్పీల హరి చిరస్మరణీయుడు. మంగళవారం రాత్రి11గంటలకు ముంబైలోని ఒక ఆసుపత్రిలో ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్‌కు సంబంధించి చికిత్స పొందుతూ ఊపిరి వదిలారు.1952లో కోల్‌కతాలోని సంగీతం తెలిసిన కుటుంబంలో జన్మించిన బప్పీ దా 450కి పైగా చిత్రాలకు పలు ఆల్బమ్స్​కు సంగీతాన్ని అందించారు. ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ కు బంధువు అయిన బప్పీ దా తన నాలుగవ ఏట దివంగత గాయని లతా మంగేష్కర్ పాడిన పాటకు తబలా వాయించాడు. బెంగాల్‌లో కొన్ని చిత్రాల్లోనూ నటించిన.. సంగీతం సమకూర్చిన బప్పీ దా.. హిందీలో1970లో నన్హా షికారి సినిమాతో తన 19వ ఏట సంగీత దర్శకుడిగా ప్రవేశించారు. అప్పటి నుంచి1990 వరకు ఆయన వెనుతిరిగి చూడలేదు.

తెలుగులో ‘సింహాసనం, స్టేట్‌రౌడీ, గ్యాంగ్ లీడర్’ లాంటి  ఎన్నో చిత్రాలకు ఆయన సంగీతం సమకూర్చారు. హిందీలో సునీల్ దత్ నటించిన జఖ్మీ చిత్రం బప్పీ దాకు మంచి బ్రేక్ ఇచ్చింది. మిథున్ చక్రవర్తి,  జితేంద్ర..అనిల్ కపూర్, అమితాబ్ నటించిన వందకు పైగా చిత్రాలకు ఆయన మ్యూజిక్ ఇచ్చారు. డిస్కో డాన్సర్​ కోసం పైదా కర్నె వాలెకి..లాంటి చిత్రాల్లో ఆయన పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. ‘షరాబి, సాహెబ్. చల్తే చల్తే, గురు’ చిత్రాల్లోని పాటలు హిట్ అయ్యాయి. మ్యూజిక్‌ను నెక్ట్స్​ లెవెల్‌కి తీసుకెళ్లిన ఘనుడు ఆయన. తన డిఫరెంట్ స్టైల్‌ మ్యూజిక్‌తో విదేశాల్లో కూడా  కార్యక్రమాలు నిర్వహించిన బప్పీ దాకు ఎన్నో అవార్డులు, రివార్డులు, బిరుదులు వచ్చినా ప్రపంచ ప్రఖ్యాత గ్రామ్మి అవార్డ్ కోసం ఎదురు చూసేవారు. ఐదుసార్లు ఎంట్రీ లభించినప్పటికి అవార్డ్ రాలేదు. బంగారం ప్రియుడు అయిన బప్పీ దా ఎప్పుడూ ఒంటినిండా బంగారంతోనే కనిపించేవారు. కళ్ళకు కలర్ అద్దాలు బంగారం బప్పిదా ఐడెంటిటీ అయిపోయింది. వెనక ముందు చూడకుండా వారు వీరు అని తేడా లేకుండా ఎవరి మీదైనా తన సహజ ధోరణిలో జానీ అంటూ సెటైర్‌‌లు వేసే రాజ్ కుమార్ ‘‘ఒకసారి..బప్పీ దాను ఉద్దేశించి జానీ బంగారం బాగానే ఉంది.. ఇందులో ఒక మంగళ సూత్రందే కొరత’’ అన్నారట...దానికి బప్పిదా నవ్వుతూ ‘‘నా ఐడేంటిటీ బంగారమే’ అన్నాడట. ఒకసారి ఇండియాకు మైకేల్ జాక్సన్ వచ్చినపుడు బప్పితో ‘మీ బంగారు లాకెట్ బాగుంద’ని అన్నాడట. అపుడు ఆ లాకెట్ ఇద్దామని అనుకుని...అయితే లాకెట్లో గణేశుడి ప్రతిమ ఉందని ఇవ్వలేదట ఈ విషయాన్ని ఒక సందర్భంలో ఆయనే చెప్పాడు...ముంబయి సే ఆయా మేర దోస్త్ ...దోస్త్ కో సలాం కరో.. ఇది బప్పిదా ఫేమస్ పాట. ఆఖరిగా విశాల్ శేఖర్ సంగీత సారథ్యంలో 2020లో బాగీ3లో పాడారు.  తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి బప్పిదా స్టయిల్‌ని అనుకరించేవారు.బప్పీ దా...ముంబై సే ఇస్ దునియాసే హామేషా కేలియే చల్దియా అప్నా మ్యూజిక్ కా సర్తాజ్​.

:: ఎండి.మునీర్, సీనియర్​ జర్నలిస్ట్​