మన సంస్కృతిలో ఆవులు, ఎద్దులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వ్యవసాయ పనులకు ఉపయోగపడే ఆవులు, ఎద్దులను రైతులు పూజిస్తుంటారు. తమ ఇంట్లో కుటుంబ సభ్యులుగానే భావిస్తుంటారు. అందుకే అన్నదాతలు తమ పశువుల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తారు. ఇంట్లో పుట్టిన లేగ దూడలనైతే అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తుంటారు. తాజాగా ఓ కుటుంబం తమ ఇంట్లో జన్మించిన లేగ దూడకు బారసాల నిర్వహించింది. మచిలీపట్నంకు చెందిన ఓ కుటుంబం ఆవు దూడకు అంగరంగ వైభవంగా బారసాల నిర్వహించి మూగజీవాలపై తమకున్న అమితమైన ప్రేమను చాటుకుంది. దూడకు హారతులు ఇచ్చింది. ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపుతూ.. దానికి ఇష్టమైన ఆహార పదార్ధాలు తినిపించింది. బంధు మిత్రుల సమక్షంలో ఆనందంగా బారసాల జరుపుకుంది.
బంధు మిత్రుల సమక్షంలో..
మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్డు గోపవానిపాలెంలో మైథిలి అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఆమె గత పదేళ్లుగా ఆవును పోషిస్తున్నారు. ఆ ఆవు పేరు బంగారం. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆవు బంగారం.. ఆగష్టు 1న లేగదూడకు జన్మనిచ్చింది. తమ పిల్లలకు బారసాల నిర్వహించినట్లే..ఆ దూడకు కూడా బారసాల చేయాలని నిర్ణయించుకుంది. బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా బారసాల నిర్వహించారు. ఆ దూడకి లక్ష్మీ అని నామకరణం చేశారు. బంధువులు, మిత్రులు, చుట్టుప్రక్కల ముత్తదైవులను పిలిచి సంప్రదాయ పద్దతిలో పూజలు చేశారు. దూడను ఉయ్యాల్లో పడుకోపెట్టి పాటలు పాడుతూ హారతులు ఇచ్చి అట్టహాసంగా బారసాల నిర్వహించారు.
ఈ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరు అ మూగజీవం పట్ల ప్రేమను చూపిస్తూ.. పలు రకాలు స్వీట్లు, పండ్లు దూడకు తినిపించారు. గత ఏడాది బంగారం అవుకి పుట్టిన సీత అనే దూడకి ఇదే విధంగా బారసాల నిర్వహించారు. సొంత కుటుంబ సభ్యులను విస్మరించే ఈ రోజుల్లో.. మూగజీవాల పట్ల ప్రేమను చూపించటం పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
