బీజేపీ వ్యతిరేక కూటమిని చీల్చడానికి కేసీఆర్​ ప్రయత్నం

బీజేపీ వ్యతిరేక కూటమిని చీల్చడానికి కేసీఆర్​ ప్రయత్నం
  • మధ్యయుగపు నాటి గడీల సంస్కృతి తెచ్చిన్రు
  • కాళేశ్వరంలో అదనంగా ఒక్క ఎకరానికీ నీళ్లివ్వలె 
  • సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు:  బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యమవుతున్న కూటమి పక్షాలను చీల్చి బీజేపీకి మేలు చేయాలని కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.   మంగళవారం ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్​లో ఆయన మాట్లాడారు..   పాట్నాలో జరిగిన బీజేపీ వ్యతిరేక పార్టీల కూటమిలో అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారని,   హైదరాబాద్​లో అదే అఖిలేష్ యాదవ్ తో కేసీఆర్ రహస్య మంతనాలు జరుపుతున్నారని చెప్పారు. ఖమ్మంలో భారీ సభ పెడ్తున్నట్లు  జిల్లా పోలీస్​ యంత్రాంగానికి  ముందే చెప్పామని అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకోవాలని ప్రయత్నాలు చేశారన్నారు.  

తెలంగాణను పునర్నిర్మాణం చేస్తున్నామని మధ్యయుగపు కాలంనాటి ఆలోచనలు అమలుచేస్తున్నారన్నారు. వందల ఎకరాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గడీల తరహాలో ఫామ్ హౌస్ లను కట్టుకుని భూ దందాలు,  సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు.   మధ్యయుగపు నాటి ఆలోచనలను బీఆర్​ఎస్​ అమలుచేస్తున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని,  కాళేశ్వరం ద్వారా అదనంగా ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా  అని ప్రశ్నించారు.  ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి ప్రజలకు అందించాల్సిన అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదన్నారు. 

తర్వాత ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మడుపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో భట్టి విక్రమార్కను ఘనంగా సన్మానించారు.  సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పీసీసీ ఉపాధ్యక్షుడు పోట్ల నాగేశ్వరావు, పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరావు, వడ్డే నారాయణరావు, పుచ్చకాయల వీరభద్రం, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకులు దాసరి డానియేల్, పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కన్వీనర్ బుల్లెట్ బాబు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు.