బతుకమ్మ కల్చర్ ‌‌ మాత్రమే కాదు.. ప్రకృతిని పూజించే పండుగ

బతుకమ్మ కల్చర్ ‌‌ మాత్రమే కాదు.. ప్రకృతిని పూజించే పండుగ

బతుకమ్మ పండుగ వచ్చిందంటే.. తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ మనసు విచ్చుకున్న పువ్వోలె మురిసిపోతది. రంగురంగుల పూలను తెచ్చి, వరుసకో రంగు పూలతోని బతుకమ్మలు పేరుస్తరు. కొత్త బట్టలు కట్టుకొని, బతుకమ్మలను కచ్చీరుకు తీస్కపోయి ఒక దగ్గర పెడ్తరు. వాడకట్టంతా కలిసి ఆకాశమంత సంబురంతోని ఆ పూల దేవత చుట్టూ తిరుగుతూ ఆడ్తరు, పాడ్తరు. వాళ్ల చప్పట్ల సప్పుడుకు గౌరమ్మ మనసు కూడా సంబురమైతదేమో అనిపిస్తది. ఇగ.. చీకటిపడ్డంక ‘‘పోయిరా గౌరమ్మా’’ అంటూ సాగనంపుతరు. 

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎన్నో రకాల పండుగలు చేసుకుంటుంటారు. వాటిలో ఎక్కువగా అక్కడి కల్చర్, ట్రెడిషన్స్, నమ్మకాల వల్ల ఏర్పడినవే. కానీ.. మన దగ్గర చేసుకునే బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది కల్చర్ ‌‌ ‌‌ మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజలు ప్రకృతిని పూజించే పండుగ. సమస్త జీవకోటికి ఆధారమైన ప్రకృతి బాగుండాలని చేసే పండుగ ఇది.  

ఇప్పుడే ఎందుకంటే.. 

ప్రతి సంవత్సరం చలికాలం రాకముందు, వర్షాకాలం చివరి రోజుల్లో ఈ పండుగ చేస్తుంటారు. అప్పటికి వానలతో చెరువులన్నీ నిండుతాయి. ఏ వాగులో చూసినా.. నీళ్లు పుష్కలంగా ఉంటాయి. బీడు భూముల్లో అడవి పువ్వులు సాగు చేసినట్టు విరగబూస్తాయి. అచ్చం పూలతో నేలను కప్పేసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ‘గునుగు, తంగేడు, చామంతి, నంది-వర్ధనం లాంటి పూలు ఎక్కువగా దొరుకుతాయి. ఈ సీజన్​లో పూలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి.. ఆ పూలతో బతుకమ్మలు పేరుస్తారు. పైగా ఈ టైంలో వ్యవసాయ పనులు కూడా కాస్త తక్కువే. మొక్కజొన్న కోతకు రాకముందు, సీతాఫలాలు పండకముందు ఈ పండుగ చేసుకుంటారు. 

తొమ్మిది రోజుల మురిపెం

వెయ్యేండ్ల నుంచి తెలంగాణలో ఈ పండుగ చేస్తున్నారు. ఆశ్వయుజ మాసం వస్తూనే బతుకమ్మ సంబురాలు తెస్తుంది. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిదిరోజుల పాటు జరిగే పెద్ద పండుగ బతుకమ్మ. దసరాకు రెండు రోజుల ముందు పేర్చే ‘సద్దుల బతుకమ్మ’తో పండుగ ముగుస్తుంది.  తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి, బతుకమ్మకు పెడతారు. 

ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమావాస్య(భాద్రపద అమావాస్య, పెత్తరమాస, పెద్దల అమావాస్య అని కూడా పిలుస్తారు) రోజున చేసే మొదటి బతుకమ్మ. ఈ బతుకమ్మను పేర్చే పూల కాడలను చేతులతో తుంచాలి. అయితే.. ఒకప్పుడు కొందరు ఎక్కువ పూలు తుంచడానికి ఇబ్బంది పడి మొదటి రోజు బతుకమ్మ పేర్చడానికి పూలకాడలను నోటితో కొరికారట. దాంతో ఆ బతుకమ్మ ఎంగిలి అయిందని, అప్పటినుంచి మొదటి రోజు చేసే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు బతుకమ్మను పేర్చడానికి ఒకరోజు ముందే పువ్వులు తీసుకొస్తారట. అందుకే ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారని మరికొందరు చెప్తుంటారు. మొదటి రోజు నువ్వులు, బియ్యప్పిండి, నూకలు కలిపి నైవేద్యం చేస్తారు.
అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు అటుకుల బతుకమ్మ చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం చేసి అమ్మవారికి పెడతారు. 
ముద్దపప్పు బతుకమ్మ:  విదియ రోజు బతుకమ్మకి ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం పెడతారు. 
నాన బియ్యం బతుకమ్మ:  తదియ రోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట్ల బతుకమ్మ: చవితి రోజు అట్లు నైవేద్యంగా పెడతారు. 
అలిగిన బతుకమ్మ:  పంచమి రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టరు.  
వేపకాయల బతుకమ్మ: షష్ఠి రోజు బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లలా తయారు చేసి నైవేద్యంగా పెడతారు. 
వెన్నముద్దల బతుకమ్మ: సప్తమి రోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం చేసి, పెడతారు. 
సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి రోజు చివరి బతుకమ్మ. ఇదే రోజు దుర్గాష్టమి కూడా. ఈ రోజు కొందరు ఐదురకాల నైవేద్యాలు చేస్తారు. అవి.. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ ‌‌ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం. ఇంకొందరు ఇందులో ఏవైనా రెండు మూడు రకాలు చేసి, ప్రసాదంగా పెడతారు. మొదటి ఎనిమిది రోజులు  బతుకమ్మలను చిన్నగా పేరుస్తారు. కానీ.. చివరి రోజు మాత్రం పెద్దగా పేరుస్తారు. అందుకే ఆ రోజు ఉదయం నిద్ర లేవగానే మగవాళ్లు పూల కోసం పరుగులు తీస్తుంటారు. పెద్ద బతుకమ్మ ఎక్కువగా ఇత్తడి ప్లేట్​లో (తాంబలం)లోనే పేరుస్తారు. తర్వాత గల్లీలో ఒకచోట అన్ని బతుకమ్మలు పెట్టి పాటలు పాడుతూ ఆడతారు. తర్వాత చెరువు దగ్గరకు తీసుకెళ్లి అక్కడ కూడా కాసేపు ఆడి నిమజ్జనం చేస్తారు.  

పూలను గౌరవించడం

ప్రకృతిని ఆరాధించడం మన సంస్కృతిలో భాగం. అంతేకాదు.. మన పూర్వీకులు ప్రకృతి నుంచే ఔషధ జ్ఞానం నేర్చుకున్నారు. ప్రకృతే మనల్ని కాపాడుతుందని నమ్మారు. ప్రకృతిని దేవతగా కొలిచారు. తల్లిగా భావించారు. అందుకే ప్రకృతిని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ పండుగను మొదలుపెట్టారు. పైగా పువ్వుని సంతానానికి సంకేతంగా నమ్ముతారు. అందుకే పూలను పూజించేందుకు ఆడవాళ్లు బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మను కొలిచి.. ‘‘బతుకుని ఇవ్వమ్మా”అని వేడుకుంటారు. అంటే.. నీళ్లు, ఆహారం, ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుంటారు. పైగా బతుకమ్మ పేర్చడానికి వాడే పూలల్లో మెడిసినల్ ‌‌వాల్యూస్ ‌‌ఉన్నాయని కొందరు చెప్తుంటారు.

అవేంటంటే..  

తంగేడు (కాసియా ఆరిక్యులట): ఈ మొక్కను ఆయుర్వేదంలో వాడతారు. దీని విత్తనాలను షుగర్ ‌‌ ట్రీట్మెంట్​కు ఉపయోగిస్తారు.గునుగు (సెలోసియా): ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ డయాబెటిక్ ‌‌, యాంటీ ఆక్సిడెంట్​గా పనిచేస్తుంది. బంతి (మ్యారిగోల్డ్): ఇందులో విటమిన్–సి, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. చామంతి (క్రైసాంతిమమ్ ‌‌): ఈ పువ్వులో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, కాల్షియం, ఐరన్, సోడియం లాంటి మినరల్స్ ‌‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇలా ఒక్కో పువ్వుకు ఒక్కో ఔషధ గుణం ఉంది. కాబట్టి, వాటిని చెరువుల్లో కలిపితే నీళ్లు శుభ్రమవుతాయని చెప్తుంటారు. బతుకమ్మను చెరువులో వేశాక, పసుపుతో చేసిన గౌరమ్మను చెంపలకు రుద్దుకుంటారు. అలా చేయడం వల్ల ముఖంపై బ్యాక్టీరియా చనిపోతుంది. అమ్మవారికి ఇచ్చే నైవేద్యంలో కూడా హెల్త్ ‌‌ బెనిఫిట్స్ ‌‌ఎక్కువే. అందుకే బతుకమ్మ పండుగ మొదలైందని కొందరు చెప్తుంటారు. 

బతుకమ్మ పేర్చే పాట

తొమ్మిదీ రోజులు ఉయ్యాలో 
నమ్మికా తోడుత ఉయ్యాలో 
అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో
అరుగులూ వేయించిరి ఉయ్యాలో 
గోరంట పూలతో ఉయ్యాలో 
గోడలు కట్టించి ఉయ్యాలో 
తామరపూలతో ఉయ్యాలో 
ద్వారాలు వేయించి ఉయ్యాలో 
మొగిలి పూలతోని ఉయ్యాలో 
మొగరాలు వేయించి ఉయ్యాలో 
వాయిలీ పూలతో ఉయ్యాలో 
వాసాలు వేయించి ఉయ్యాలో 
పొన్నపూలతోటి ఉయ్యాలో
యిల్లనూ కప్పించి ఉయ్యాలో 
దోసపూలతోని ఉయ్యాలో 
తోరణాలు కట్టించి ఉయ్యాలో 
పసుపుముద్దను చేసి ఉయ్యాలో 
గౌరమ్మను నిలిపిరి ఉయ్యాలో 
చేమంతి పూలతోని ఉయ్యాలో 
చెలియను పూజించిరి ఉయ్యాలో 
సుందరాంగులెల్ల ఉయ్యాలో 
సుట్టూత తిరిగిరి ఉయ్యాలో 
ఆటలు ఆడిరి ఉయ్యాలో 
పాటలు పాడిరి ఉయ్యాలో
గౌరమ్మ వరమిచ్చె ఉయ్యాలో
కాంతాలందరికి ఉయ్యాలో 
పాడినా వారికి ఉయ్యాలో 
పాడి పంటలు కల్గు ఉయ్యాలో 
ఆడినా వారికి ఉయ్యాలో
ఆరోగ్యము కల్గు ఉయ్యాలో 
విన్నట్టి వారికి ఉయ్యాలో 
విష్ణుపథము కల్గు ఉయ్యాలో

ఒక్కేసి పువ్వేసి.. 

ఒక్కేసి పువ్వేసి చందమామా...     ఒక్క జాము ఆయె చందమామా
పైన మఠం కట్టి చందమామా...     కింద ఇల్లు కట్టి చందమామా 
మఠంలో ఉన్న చందమామా...     మాయదారి శివుడు చందమామా 
శివపూజ వేళాయె చందమామా...     శివుడు రాకపాయె చందమామా 
గౌరి గద్దెల మీద చందమామా...     జంగమయ్య ఉన్నాడె చందమామా  
రెండేసి పూలేసి చందమామా...     రెండు జాములాయె చందమామా 
శివపూజ వేళాయె చందమామా...     శివుడు రాకపాయె చందమామా 
మూడేసి పూలేసి చందమామా...     మూడు జాములాయె చందమామా 
శివపూజ వేళాయె చందమామా...     శివుడు రాకపాయె చందమామా 
నాలుగేసి పూలేసి చందమామా...     నాలుగు జాములాయె చందమామా 
శివపూజ వేళాయె చందమామా...    శివుడు రాకపాయె చందమామా 
ఐదేసి పూలేసి చందమామా...    ఐదు జాములాయె చందమామా 
శివపూజ వేళాయె చందమామా...    శివుడు రాకపాయె చందమామా 
ఆరేసి పూలేసి చందమామా...    ఆరు జాములాయె చందమామా 
శివపూజ వేళాయె చందమామా...    శివుడు రాకపాయె చందమామా 
ఏడేసి పూలేసి చందమామా...     ఏడు జాములాయె చందమామా 
శివపూజ వేళాయె చందమామా...     శివుడు రాకపాయె చందమామా 
ఎనిమిదేసి పూలేసి చందమామా...     ఎనిమిది జాములాయె చందమామా 
శివపూజ వేళాయె చందమామా...    శివుడు రాకపాయె చందమామా 
తొమ్మిదేసి పూలేసి చందమామా...     తొమ్మిది జాములాయె చందమామా 
శివపూజ వేళాయె చందమామా...    శివుడు రాకపాయె చందమామా 
తంగేడు వనములకు చందమామా...    తాళ్ళు కట్టాబోయె చందమామా 
గుమ్మాడి వనమునకు చందమామా...    గుళ్ళు కట్టాబోయె చందమామా 
రుద్రాక్ష వనములకు చందమామా...    నిద్ర చేయబాయె చందమామా

సాగనంపే పాట 

తంగేడు పూవుల్ల చందమామ...     బతుకమ్మ పోతుంది చందమామ 
పోతె పోతివిగాని చందమామ...     మల్లెన్నడొస్తావు చందమామ 
యాడాదికోసారి చందమామ...     నువ్వొచ్చిపోవమ్మ చందమామ 
బీరాయి పూవుల్ల చందమామ...     బతుకమ్మ పోతుంది చందమామ 
పోతె పోతివిగాని చందమామ...     మల్లెన్నడొస్తావు చందమామ 
యాడాదికోసారి చందమామ...     నువ్వొచ్చి పోవమ్మచందమామ 
గునిగీయ పూవుల్ల చందమామ...     బతుకమ్మ పోతుంది చందమామ 
పోతే పోతివిగాని చందమామ...     మల్లెన్నడొస్తావు చందమామ 
యాడాదికోపారి చందమామ...     నువ్వొచ్చిపోవమ్మ చందమామ 
కాకర పూవుల్ల చందమామ...     బతుకమ్మ పోతుంది చందమామ 
పోతె పోతివిగాని చందమామ...     మల్లెన్నడొస్తావు చందమామ 
యాడాదికోసారి చందమామ...     నువ్వొచ్చి పోవమ్మ చందమామ 
కట్లాయి పూవుల్ల చందమామ...     బతుకమ్మ పోతుంది చందమామ 
పోతె పోతివిగాని చందమామ...     మల్లెన్నడొస్తావు చందమామ 
యాడాదికోసారి చందమామ...     నువ్వొచ్చి పోవమ్మ చందమామ 
రుద్రాక్ష పూవుల్ల చందమామ...     బతుకమ్మ పోతుంది చందమామ  
పోతె పోతివిగాని చందమామ...     మల్లెన్నడొస్తావు చందమామ 
యాడాదికోసారి చందమామ...     నువ్వొచ్చి పోవమ్మ చందమామ 
గుమ్మడి పూవుల్ల చందమామ...     బతుకమ్మ పోతుంది చందమామ  
పోతె పోతివిగాని చందమామ...     మల్లెన్నడొస్తావు చందమామ 
యాడాదికోసారి చందమామ...     నువ్వొచ్చి పోవమ్మ చందమామ