భారతదేశ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే కులాన్ని అర్థం చేసుకోవాలి. కులాన్ని అర్థం చేసుకోవాలంటే శ్రమను అర్థం చేసుకోవాలి. శ్రమను అర్థం చేసుకోవాలంటే ఉత్పత్తి కులాల చరిత్రను తెలుసుకోవాలి. ఉత్పత్తి కులాల చరిత్రను తెలుసుకోవాలంటే బీసీ సమాజం ఎదుర్కొంటున్న చారిత్రక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, భావజాల పరమైన దోపిడీని అధ్యయనం చేయాలి. ఆ సమగ్ర దృష్టితో, ఉద్యమ అవసరంతో, రాజకీయ స్పష్టతతో వెలువడిన పుస్తకమే “కుల వ్యవస్థ – బీసీ సమస్య.”
పాపని నాగరాజు సంపాదకత్వం వహించిన ఈ పుస్తకం ఒక సామాజిక పత్రం, రాజకీయ ప్రకటన, ఆర్థిక విశ్లేషణ, భావజాల ఆయుధం, సాంస్కృతిక పునర్నిర్మాణ దిశానిర్దేశం, ఉద్యమ కార్యాచరణ పథకం. బీసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కేవలం బాధల కథనంగా కాకుండా, పోరాట దిశగా మలిచే ఒక ఉద్యమ మానిఫెస్టోగా ఇది నిలుస్తుంది.
వెలుగు చూసిన చరిత్ర - పెరిగిన ప్రభావం
2016లో తొలిసారిగా వెలువడిన ఈ పుస్తకం ఒక ప్రచురణగా ఆగిపోలేదు. బీసీ ఉద్యమ, విద్యార్థి వర్గాల్లో, ప్రజా సంఘాల్లో, మేధావుల్లో, రాజకీయ వేదికల్లో విస్తృత చర్చకు దారి తీసింది. నేడు ఈ గ్రంథం నాలుగో ముద్రణకు చేరుకోవడం దీని ప్రభావానికి నిదర్శనం.
మొదటి మూడు ముద్రణల సందర్భంలో వేలాది ప్రతులు విద్యార్థులకు, ఉద్యమకారులకు, బీసీ–దళిత–బహుజన సంఘాలకు, ప్రజా ప్రతినిధులకు, రచయితలకు, మేధావులకు ఉచితంగా పంపిణీ చేయబడ్డాయి. అందువల్ల ఇది మార్కెట్‌లో అమ్ముడైన పుస్తకం మాత్రమే కాదు.. ప్రజల్లోకి ప్రవహించిన చైతన్య గ్రంథం.ఈ పుస్తకం వెలువడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు ప్రత్యేక సంస్థాగత వ్యవస్థల అవసరం, బీసీ హక్కులపై చర్చ మరింత బలపడింది. కొంతవరకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు ఆలోచనను బలోపేతం చేసిన గ్రంథంగా కూడా దీనిని పలువురు అభివర్ణించారు.
ఇదే సంకలనకర్త పాపని నాగరాజు “కుల వ్యవస్థ – దళిత సమస్య” గ్రంథాన్ని కూడా తీసుకురావడం విశేషం. అంటే బీసీ–దళిత సమస్యలను విడిగా కాకుండా, సమగ్ర సామాజిక విముక్తి దిశగా చూడాల్సిన అవసరాన్ని ఆయన రచనా ప్రయాణం స్పష్టం చేస్తుంది.
నిర్మాణ పరిపక్వత - ఒక అధ్యయన గ్రంథం
ఈ గ్రంథం కేవలం విస్తారమైన పేజీల సమాహారం కాదు.. ఇది ఒక క్రమబద్ధమైన అధ్యయన గ్రంథం. ఇందులో మొత్తం 28 ప్రధాన అధ్యాయాలు ఉన్నాయి. 29వ అధ్యాయంగా 9 అనుబంధాలు ఇవ్వడం ఈ గ్రంథానికి మరింత ప్రామాణికతను తీసుకొచ్చింది. 28 అధ్యాయాలు సిద్ధాంతాన్ని అందిస్తే, 29వ అధ్యాయంలోని 9 అనుబంధాలు ఉద్యమానికి ఆధారాలను అందిస్తున్నాయి.
ఈ పుస్తకం సాధారణ సమస్యల చర్చతో ఆగిపోదు. బీసీ సమాజ అంతర్గత విభజనలు, విధానపరమైన మోసాలు, రాజకీయ కుట్రలు, చట్టపరమైన వివక్షతను విశ్లేషిస్తుంది.
1. కుల రాజకీయాల విశ్లేషణ : “కాపులు బీసీలు ఎలా అవుతారు?” అనే ప్రశ్న ద్వారా బీసీ జాబితా రాజకీయాన్ని ప్రశ్నిస్తుంది. బీసీ–డీ నుంచి బీసీ–ఏలో కొన్ని కులాలను చేర్చడం వల్ల నిజంగా వెనుకబడిన వర్గాలకు జరిగే నష్టాన్ని గణాంకాలతో వివరిస్తుంది.
2. సామాజిక విప్లవ స్వాప్నికుల చరిత్ర : జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, పెరియార్, మార్క్స్, మరోజు వీరన్న వంటి మహనీయుల పోరాట దిశను గుర్తు చేస్తుంది.
3. కులం – వర్గం – అస్తిత్వాలు: కులం–వర్గం–అస్తిత్వాల అంతర్గత సంబంధాన్ని విశ్లేషిస్తూ విముక్తి రాజకీయాలకు సిద్ధాంత పునాది వేస్తుంది.
4. బీసీ ఐక్యతకు నాంది కావాలి: బీసీ సమాజం అంతర్గతంగా విభజించబడకుండా ఐక్యంగా నిలవాల్సిన అవసరాన్ని చర్చిస్తుంది.
5. బీసీలపై దాడులు : బీసీలపై జరుగుతున్న సామాజిక, వృత్తి ఆధారిత, ఆర్థిక దాడులను నమోదు చేస్తుంది.
6. దామాషా ప్రాతినిధ్యమే సామాజిక న్యాయం: జనాభా ప్రాతిపదికన వాటా–అంటే దామాషా ప్రాతినిధ్యం–సామాజిక న్యాయం సాధనకు ప్రధాన మార్గమని వాదిస్తుంది.
7. బీసీల అభివృద్ధికి ప్రణాళిక: విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక రంగాల్లో బీసీల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను చర్చిస్తుంది.
8. క్రీమీలేయర్ చర్చ: “బీసీలు అనగానే క్రీమీలేయర్?” అనే దుష్ప్రచారాన్ని ఖండిస్తుంది.
9. బీసీ మహిళా కోటా : బీసీ మహిళలకు ప్రత్యేక రాజకీయ ప్రాతినిధ్య అవసరాన్ని చెబుతుంది.
10. హవా అగ్రవర్ణాలదే ఎందుకు? : బీసీలు సంఖ్యలో అధికం అయినా అధికారం అగ్రవర్ణాల చేతుల్లోనే ఎందుకు ఉందో ప్రశ్నిస్తుంది.
11. బీసీ కోటాలో అగ్రకులాలు: రిజర్వేషన్ రాజకీయాల్లో అగ్రకులాల చొరబాటును ప్రశ్నిస్తుంది.
12. ఓబీసీ కోటాలో జాట్లు–పటేళ్లు–గుర్జర్లు : జాతీయ స్థాయిలో రిజర్వేషన్ రాజకీయాల్లో జరిగే వక్రీకరణను విశ్లేషిస్తుంది.
13. ముస్లిం రిజర్వేషన్ల వాద–ప్రతివాదాలు : ముస్లిం రిజర్వేషన్ల చట్టపరమైన, సామాజిక, రాజకీయ కోణాలను సమీక్షిస్తుంది.
14. మండల్ వాద–ప్రతివాదాలు : మండల్ కమిషన్ చరిత్ర, అమలు ఫలితాలను చర్చిస్తుంది.
15. కమిషన్ల నివేదికలు : వివిధ బీసీ కమిషన్ల నివేదికలు, వాటి పరిమితులు, అవకాశాలను విశ్లేషిస్తుంది.
బీసీ అట్రాసిటీ యాక్ట్ – ఉద్యమ డిమాండ్
ఈ పుస్తకం ముందుకు తెచ్చిన అత్యంత కీలకమైన ఉద్యమ డిమాండ్లలో ఒకటి “బీసీ అట్రాసిటీ యాక్ట్.” దళితులకు ఉన్నట్టే బీసీలపై జరుగుతున్న సామాజిక, వృత్తి, ఆర్థిక, అవమానకర దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం అవసరమని ఈ గ్రంథం బలంగా చెబుతుంది.
ఈ గ్రంథంలో కనిపించే భావజాలం, ఫూలే – అంబేద్కర్ – పెరియార్ – మార్క్స్ – మరోజు వీరన్న ఆలోచనల సమన్వయం. అందుకే ఇది కేవలం బాధల పుస్తకం కాదు.. ఒక సిద్ధాంత గ్రంథం. ఇది చదివి అల్మారాలో పెట్టే పుస్తకం కాదు. చదివి చర్చించాల్సిన పుస్తకం. చదివి సంఘటితం కావాల్సిన పుస్తకం.
ఇది కుల–వర్గ దోపిడీపై యుద్ధ ప్రకటన. బహుజన చైతన్యానికి ఆలోచనా ఆయుధం. రాజ్యాధికారానికి దారిచూపే ఉద్యమ మానిఫెస్టో. ఈ పుస్తకం ప్రతి పాఠకుడిలో ఒక ప్రశ్నను రేకెత్తిస్తుంది: “జనాభాలో మెజారిటీ అయిన మనం రాజ్యాధికారంలో ఎందుకు మైనారిటీగా ఉన్నాం?” ఆ ప్రశ్నకు సమాధానం వెతికే చైతన్యాన్ని కలిగించడమే ఈ గ్రంథం చారిత్రక పాత్ర.
- పి. రేణుక భూంపల్లి-
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ : openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
