విద్యార్థుల ధర్నా : బీసీ హాస్టళ్లు పెంచాలి

విద్యార్థుల ధర్నా : బీసీ హాస్టళ్లు పెంచాలి

ముషీరాబాద్ వెలుగు : బీసీ విద్యార్థులకు హాస్టల్స్ ఏమాత్రం సరిపోవడం లేదని బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ  కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం బీసీ డైరెక్టర్ ఆఫీస్‌ను ముట్టడించారు. తర్వాత ఆర్ కృష్ణయ్య, గుజ్జ కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 251 బీసీ కళాశాలల హాస్టళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, వీటిలో కేవలం 26 వేల మందికి మాత్రమే సౌకర్యం కల్పిస్తున్నారని, ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని దశలవారీగా హాస్టల్స్ సంఖ్య పెంచాల్సిన ఎంతైనా ఉందని డిమాండ చేశారు.

రాజధానిలో కాలేజ్ స్థాయి కోర్సు చదివే బీసీ విద్యార్థులకు హాస్టల్ సీట్లు లభించక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి  వచ్చే వారికి హాస్టల్ వసతి సౌకర్యం లభించకపోవడంతో చదువు మానుకొని వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.