తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : జిల్లా కన్వీనర్ భద్ర బోయిన సైదులు

తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి :  జిల్లా కన్వీనర్ భద్ర బోయిన సైదులు

సూర్యాపేట, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని బీసీ జేఏసీ సూర్యాపేట జిల్లా కన్వీనర్ భద్ర బోయిన సైదులు తెలిపారు.  బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 10వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన తెలంగాణ ఉద్యమకారుల మహాసభకు బీసీ జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఎందరో ఉద్యమకారుల త్యాగాలతో , ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాధించామన్నారు. 

తొలి దశ, మలి దశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం  సుమారుగా 1500 మంది  అమరులయ్యారని గుర్తు చేశారు. సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులను ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. తమ జీవితాలని పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన ఎందరో ఉద్యమకారులకు ఆర్థిక భద్రత లేక కుటుంబ జీవనాన్ని సాగించుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. 

ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో రానున్న రోజుల్లో  టీయూ జేఏసీతో  కలిసి బీసీ జేఏసీ కూడా ప్రతి ఉద్యమంలో ముందుండి పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ నెల 10న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ జేఎసీ జిల్లా నాయకులు నాగరాజు, ముత్యం నాగేంద్రబాబు, శ్యామ్, యోగి నరేష్, శ్యామ్ కొమ్ము నాగయ్య, ఎస్కే సయ్యద్, కట్ట రాజు, మెడబోయిన గంగయ్య తదితరులు పాల్గొన్నారు.