గొంతెత్తని బీసీ మంత్రులు!.. లక్ష రూపాయల పథకం సరిపోతదా?

గొంతెత్తని బీసీ మంత్రులు!.. లక్ష రూపాయల పథకం సరిపోతదా?

ఇటీవల అధికార పార్టీలో ఉన్న ఓ బీసీ నాయకుడు.. తనకు బెదిరింపు కాల్స్ ​వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపు కాల్స్​ ఎవరికి వచ్చినా.. ఖండించాల్సిందే. మరి బీసీ ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థులు గత తొమ్మిది సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న అణచివేతలు, సంక్షేమం, అభివృద్ధిలో, చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల్లో జరుగుతున్న అన్యాయం గురించి ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వంలో బీసీ నాయకులు ఉన్నా.. బీసీ ప్రజల సమస్యలను పరిష్కరించకపోవడాన్ని ఎలా చూడాలి? తెలంగాణలో బీసీ నాయకులు చైతన్యవంతులైతే 54 శాతం జనాభా గల బహుజన బీసీ బిడ్డల దుస్థితి ఎందుకు దారుణంగా ఉంటుంది? అనేక కష్టాలు పడి త్యాగాలు చేసి, ప్రాణాలు అర్పించి, సకల జనుల సమ్మె చేసి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలను అణగదొక్కడం గత తొమ్మిది సంవత్సరాలుగా వేగవంతమైంది.

బీసీల కష్టాలకేదీ పరిష్కారం

రాష్ట్ర మంత్రివర్గంలో ముష్టి వేసినట్టుగా మూడు మంత్రి పదవులు మూడు కులాలకు ఇచ్చి11 కీలక పదవులు మూడు సామాజిక వర్గాలు పంచుకున్నాయి. ఒక్క కుటుంబానికే నాలుగు క్యాబినెట్ పదవులు, డజను మంత్రిత్వ శాఖలు దక్కాయి. అధికార పార్టీలో కీలకంగా ఉన్న ఓ బీసీ నేతను పొగబెట్టి బయటకు పంపుతున్నప్పుడు బీసీ నాయకులు మాట్లాడకపోవడం విచారకరం. అదే నాయకుడిని ఉప ఎన్నికలో ఓడించి రాజకీయంగా అణగదొక్కాలని రచించిన వ్యూహంలో బీసీ నాయకులు భాగస్వామ్యం పంచుకోవడం కుట్రనే కదా? బీసీ నాయకులు ప్రభుత్వ పెద్దల దగ్గర సాగిలపడటం వల్లే.. బీసీల కష్టాలు, సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోతున్నాయి. అలాంటప్పుడు బీసీ కోటాలో మంత్రులుగా ఉండే అర్హత మీకు ఎవరు ఇచ్చారు? గత తొమ్మిది సంవత్సరాల నుంచి బీసీ, నిరుద్యోగ యువతీ యువకులకు బీసీ కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాల్సిన రుణాలు, సబ్సిడీలు నిలిపివేసినా బీసీ మంత్రులు కిమ్మనలేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్​లో చూపించిన బీసీ కార్పొరేషన్ నిధులను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకపోయినా, బీసీ బిడ్డల స్కాలర్షిప్​లు, ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు వేల కోట్లు పెండింగ్​లో పెట్టినా నోరు మెదపరు ఎందుకు?

నాటి నేతల స్ఫూర్తి ఏది?

బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి సర్దార్ గౌతు లచ్చన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, బాలా గౌడ్, కేశవరావు, మదన్మోహన్ దేవేందర్ గౌడ్, సీహెచ్ హనుమంతరావు, కేఈ కృష్ణమూర్తి లాంటి వారు గతంలో గళం విప్పారు. ఆనాటి ముఖ్యమంత్రులను నిలదీశారు. అవసరమైతే రాజీనామాలు చేసి ప్రజల పక్షాన నిలబడ్డారు. కానీ ఇప్పుడా పరిస్థితిలో బీసీ నాయకులు లేరు ఎందుకు? ఎంతోమంది బీసీ ఉద్యోగులకు, మేధావులకు, నిరుద్యోగులకు రైతులకు అన్యాయం జరిగినప్పటికీ అధికారంలో ఉన్న బీసీ నాయకులు మాట్లాడకపోవడం, తగిన చర్యలు చేపట్టకపోవడం చాలా దురదృష్టకరం. కేవలం ప్రభుత్వ పెద్దల నుంచి సంకేతాలు వస్తేనే మాట్లాడే స్థితిలో ఉన్న నాయకుల నుంచి తెలంగాణ బీసీ ప్రజలు ఆశించగలిగేది ఏమీ లేదని గత తొమ్మిది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వ పాలన రుజువు చేసింది. రాష్ట్రంలో నెలకొన్న రాజరికపు వ్యవస్థలో బీసీ నాయకులకు, బీసీలకు స్థానం లేదనేది కూడా ఒక వాస్తవమే. బీసీల తరఫున ప్రశ్నించని బీసీ మంత్రులు.. ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం ఉండొచ్చు. కానీ ఆ తర్వాత వారు బీసీలకు నాయకత్వం వహించగలరా? బీసీ నాయకులుగా మీరు నాటి నేతల స్ఫూర్తితో ధైర్యంగా పని చేస్తే ఏ ప్రభుత్వమైనా బీసీలను అణగదొక్కడానికి సాహసించదు. త్వరలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు ఏకం కావాలి. 54 శాతం వాటా కలిగిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే నాయకులనే ఎన్నుకోవాలి. ఆధిపత్య పాలనకు ఊడిగం చేస్తే బీసీ ప్రజలు హర్షించరన్న విషయం బీసీ మంత్రులు గుర్తుంచుకోవాలి.

లక్ష రూపాయల పథకం సరిపోతదా?

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలు.. నిధులు, నియామకాలు, కనీస సౌకర్యాలు లోపించి మూలుగుతూ మూసివేతకు దగ్గరవుతున్నాయి. ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల్లో  95%  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పిల్లలు అనే విషయం బీసీ మంత్రులకు ఎమ్మెల్యేలకు తెలియనిది కాదు. ఇవన్నీ పరిష్కరించే బాధ్యత మీది కాదా? చట్టసభలతోపాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సహా నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఎంత అన్యాయం జరిగినా, ప్రశ్నించి, పట్టించుకుని పరిష్కరించిన బీసీ నాయకులే లేరాయె. ప్రస్తుత ప్రభుత్వంలో నాయకులు ఎవరి ఉనికిని వారు కాపాడుకునే దుస్థితిలో పడ్డారు. గత మూడు సంవత్సరాల నుంచి పేద దళిత కుటుంబాలకు ప్రభుత్వం దళితబంధు పేరుతో రూ. పదిలక్షలు ఇస్తున్నది. 40 లక్షల కుటుంబాలు ఉన్న బీసీ కులాలకు చెందిన వారు వృత్తులు కోల్పోయి, జీవనాధారాలు కోల్పోయి, ఉపాధి, ఉద్యోగాలు లేక అల్లాడుతున్నప్పటికీ చూస్తూ ఉన్నారే తప్ప పరిష్కారం ఇవ్వలేకపోయారు. తాజాగా లక్ష రూపాయల సాయం పథకం తీసుకొచ్చినా.. అది కొన్ని కులాల్లో కొందరికే ఇచ్చి.. మిగతా అందరితో ఓట్లు వేయించుకొని ఎన్నికల్లో గట్టెక్కే ఎత్తుగడలాగానే ఉంది తప్ప.. బీసీల బతుకులు మార్చాలనే ఉద్దేశంతో తెచ్చినట్లుగా లేదు. మూడు కులాలకు సంబంధించిన ముగ్గురు మంత్రులు క్యాబినెట్​లో ఉన్నారు. బీసీ ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మంత్రిమండలిలో రాజ్యాంగం ద్వారా మీకు సంక్రమించింది. అలాంటప్పుడు బీసీ ప్రజల తరఫును మీరు నోరు విప్పండి. 

- కూరపాటి  వెంకటనారాయణ, రిటైర్డ్​ ప్రొఫెసర్​