వనపర్తి, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో కాంటా పూర్తయ్యాక మిల్లర్లు తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని, దీనిని అరికట్టాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్గౌడ్ కోరారు.
గురువారం మండలంలోని అంకూరు గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని జేఏసీ సభ్యులు సందర్శించి రైతులతో మాట్లాడారు. జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల ఇబ్బందులను గుర్తించాలని కోరారు.
కొనుగోలు కేంద్రానికి రైతులు వడ్లు తీసుకొచ్చి నెల రోజులైనా కాంటా వేయడం లేదన్నారు. దొడ్డు వడ్లను దించుకోకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు శివ, నాయకులు వీవీ గౌడ్, అంజన్న యాదవ్, ధర్మేంద్ర సాగర్, రాఘవేందర్ గౌడ్, అస్కని రమేశ్, రామన్ గౌడ్, రమేశ్ పాల్గొన్నారు.
