
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
హసన్ పర్తి,వెలుగు: బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో పోరాటం చేయాల్సి ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలో బీసీ మేధావులు ఏర్పాటు చేసిన సదస్సులో బీసీ యూనిటీ రాష్ట్ర అధ్యక్షుడు చెలమల్ల వెంకటేశ్వర్లు, తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరపాటి వెంకట నారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1931లో చేసిన కులగణనతో బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయపరంగా నష్టపోయారని చెప్పారు.
42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే, కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆమోదించలేదని, మరోవైపు రాష్ట్రంలో ధర్నా చేస్తామని ఇక్కడి నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మండల్ కమిషన్ నుంచి రిజర్వేషన్ల అమలు వరకు బీసీలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు.
ముస్లింల పేరుతో బడుగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ లో లేని ముస్లిం లొల్లి బీసీ రిజర్వేషన్లలో ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ ఆమోదించకపోవడానికి బీజేపీ వైఖరే కారణమన్నారు.
బీఆర్ఎస్ కరీంనగర్ బీసీల శంఖారావం పేరుతో దగా చేసేందుకు ముందుకు వస్తుందన్నారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 34 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన ఘనత కేసీఆర్ ది కాదా? అని ప్రశ్నించారు. కులగణనలో పాల్గొనని కేసీఆర్ ఫ్యామిలీ మరోసారి నయవంచనకు గురి చేసేందుకు సిద్ధపడిందని, బీసీలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వివిధ బీసీ సంఘాల నేతలు సంగని మల్లేశ్వర్, వడ్డే రవీందర్, బైరి రవికృష్ణ, చందా మల్లయ్య, తాడూరి శాస్త్రి, వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పాల్గొన్నారు.