బీసీలకు పార్టీపరంగా కాదు.. చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలి : జాజుల శ్రీనివాస్‌‌గౌడ్‌‌

బీసీలకు పార్టీపరంగా కాదు..  చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలి :  జాజుల శ్రీనివాస్‌‌గౌడ్‌‌
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌గౌడ్‌‌

నల్గొండ అర్బన్‌‌, వెలుగు : బీసీ రిజర్వేషన్లను పార్టీపరంగా కాకుండా.. చట్టబద్ధంగా అమలుచేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌గౌడ్‌‌ డిమాండ్‌‌ చేశారు. నల్గొండలోన బీసీ సంక్షేమ భవన్‌‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్‌‌ అమలు చేయాలని తాము 18 నెలలుగా పోరాటం చేస్తున్నామని, రెండు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామని చెప్పారు.

 కాంగ్రెస్‌‌ పార్టీ కూడా ఢిల్లీలో ధర్నా చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాయకులు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇది బీసీ బిల్లు కాదు.. ముస్లిం బిల్లు అని బండి సంజయ్, 10 శాతం ముస్లింలకు రిజర్వేషన్‌‌ ఒప్పుకోబోమని, కిషన్‌‌రెడ్డి, కులగణన చట్టబద్ధంగా జరగలేదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అనడం సరికాదన్నారు. 10 శాతం ముస్లిం రిజర్వేషన్‌‌ తీసేయాలనుకుంటే.. కేంద్రం బిల్లుకు సవరణ చేసి ఆమోదించవచ్చని సూచించారు. 

కేంద్రం రాష్ట్రపతిని, గవర్నర్‌‌ను ప్రభావితం చేస్తూ బిల్లును అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రులు ఢిల్లీలో ధర్నా చేస్తే.. రాహుల్‌‌ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీసీలకు చట్టబద్ధమైన హక్కు కల్పించాలని, లేకపోతే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నకిరేకంటి కాశయ్యగౌడ్, కేశబోయిన శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, వాడపల్లి సాయిబాబా, లింగం గౌడ్, మధుయాదవ్, శంకర్‌‌గౌడ్‌‌, సైదులు గౌడ్, పవన్‌‌ సాయి పాల్గొన్నారు.