కులగణన సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదు : పొన్నం ప్రభాకర్​

కులగణన సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదు : పొన్నం ప్రభాకర్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్వహించనున్న బీసీ కులగణన సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయలేదని, ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కర్తవ్యంగా భావించి అసెంబ్లీలో తీర్మానం చేశామని ఆయన పేర్కొన్నారు.

ఈ తీర్మానానికి అందరూ సహకరించడం హర్షణీయమని అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్​లో ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్​తో కలిసి పొన్నం మాట్లాడారు. ‘‘అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకునే బీసీ కులగణన సర్వేపై తీర్మానం చేశాం. బడుగు బలహీన వర్గాలు సామాజికంగా, రాజకీయ, ఉద్యోగాల్లో ఎదగాలన్నదే కాంగ్రెస్​ ప్రభుత్వ ఆకాంక్ష. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో బీఆర్ఎస్​ నాయకులు అనేక సార్లు సభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు.

ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయం. అతనికి నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే గత పదేండ్లలో ఎందుకు మాట్లాడలేక పోయారు. అప్పట్లో బీఆర్ఎస్​ ప్రభుత్వం చేసిన సకల జనుల సర్వే రిపోర్ట్​ను ఎందుకు బయట పెట్టలేదు? మీ పార్టీ ఇంటర్నల్​ మీటింగ్​లో అయినా దీని పై అడిగారా? ”అని పొన్నం ప్రశ్నించారు. 

సలహాలు ఇవ్వమంటే విమర్శలు చేస్తున్నరు..

సభలో సలహాలు, సూచనలు ఇవ్వమంటే ప్రతిపక్ష సభ్యులు ఎంతసేపూ విమర్శలు చేసే ఆలోచనలోనే ఉన్నారని ఆయన విమర్శించారు. అనుమానాలు పక్కనబెట్టి ఇప్పటికే  కులగణన జరిపిన రాష్ట్రాల నుంచి తెలుసుకోవాలని సూచించారు. కుల గణన సర్వేతో 100 శాతం ప్రయోజనం కలిగే విధంగా ముందుకు పోతామని ఆయన అన్నారు.

ఫిబ్రవరి 16 చారిత్రాత్మక ఘట్టమని ఆయన కొనియాడారు. దీని పై మేధావులు కూడా సలహాలు, సూచనలు చేయాలని కోరారు. మున్నూరు, ముదిరాజ్, యాదవ, పద్మశాలిలకు ప్రత్యేక సంస్థకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే కుల వృత్తులకు ఆధునిక, సాంకేతిక అంశాలను జోడించి ఉపాధిని పెంపొందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదు..

బీసీ కుల గణనపై ప్రతి పక్షాలకు చిత్తశుద్ధి లేదని ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​విమర్శించారు. సభలో చర్చ జరగకుండా అడ్డుకున్నారని అన్నారు. అయినా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్​ మాట్లాడుతూ ‘మేమెంతో.. మాకంత’ అన్ని విధంగా బీసీలు ఎన్నో ఏండ్లుగా చేస్తున్న డిమాండ్​ను కాంగ్రెస్​ ప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకువస్తున్నదన్నారు. బీఆర్ఎస్​ నేతలు బీసీల గురించి మాట్లాడితే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.