న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్14ను యూకేలో పూర్తి చేయాలని చూస్తున్న బీసీసీఐ అందుకోసం ఇంగ్లండ్-, టీమిండియా టెస్టు సిరీస్‌లో మార్పుల కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)ను సంప్రదించినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 మధ్య ఇరుజట్లు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడాలి. అయితే, సెప్టెంబర్‌లో ఐపీఎల్ ఫేజ్2కు విండో ఏర్పాటు చేయడం కోసం ఈ సిరీస్‌ను వారం ముందుగానే స్టార్ట్ చేయాలని, అలాగే ఒక టెస్టును తగ్గించాలని బీసీసీఐ.. ఈసీబీని కోరిందని సమాచారం. సెప్టెంబర్తొలి వారంలోనే ఈ సిరీస్ ముగిసేలా షెడ్యూల్ మార్చాలని ఈసీబీతో అనధికార చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. తగ్గించిన టెస్టు మ్యాచ్‌కు బదులు వచ్చే ఏడాది జరిగే లిమిటెడ్ ఓవర్ల సిరీస్‌లో మ్యాచ్‌ల సంఖ్యను పెంచేందుకు బీసీసీఐ హామీ ఇవ్వాల్సి ఉంటుందని బోర్డు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టెస్టు సిరీస్‌లో మార్పులు చేయాలని బీసీసీఐ నుంచి తమకు అధికారికంగా ఎలాంటి విజ్ఞప్తి రాలేదని ఈసీబీ అధికా ర ప్రతినిధి శుక్రవారం ప్రకటించారు. ‘అనేక విషయాలో బీసీసీఐతో మేం రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా కరోనా కారణంగా ఎదురవుతున్న సమస్యలను ఎలా పరిష్కరించాలనేదానిపై చర్చిస్తున్నాం. అయితే, టెస్టు సిరీస్ షెడ్యూల్ మార్పు విషయంలో అఫీషియల్‌గా ఎలాంటి రిక్వెస్ట్ రాలేదు. ఐదు టెస్టుల సిరీస్‌ను షెడ్యూల్ ప్రకారమే ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాం’ అని ఈసీబీ అధికార ప్రతినిధి చెప్పారు. అయితే, ఇరు జట్ల మధ్య చివరి టెస్టును కుదించే విషయంపై బీసీసీఐ ఎంక్వైరీ చేసిందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, క్రికెట్ రైటర్ మైకేల్ ఆథర్టన్ ‘ది టైమ్’కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు. ఈ విషయంపై బీసీసీఐ వర్గాలను సంప్రదించగా... అన్ని రకాల అవకాశాలను బోర్డు పరిశీలిస్తోందని చెప్పాయి. ఐపీఎల్14ను పూర్తి చేయాలంటే ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌ను సెప్టెంబర్ తొలి వారంలోనే ముగించడం తప్ప బోర్డుకు మరో ఆప్షన్ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లో మార్పులు అనివార్యం అనిపిస్తోంది.
