న్యూఢిల్లీ: టీ20లకు మరింత ఆదరణ పెంచేందుకు బీసీసీఐ కొత్త ప్రయోగం చేయబోతున్నది. కొత్తగా ‘ట్యాక్టికల్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్’ రూల్‌ను అమల్లోకి తీసుకురానుంది. ఈ కాన్సెప్ట్‌ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా పేర్కొంది. ముందుగా అక్టోబర్ 11 నుంచి జరిగే డొమెస్టిక్ టీ20 టోర్నీ అయిన ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఇది విజయవంతమైతే వచ్చే ఐపీఎల్‌లోనూ దీనిని ప్రవేశ పెట్టాలని బోర్డు భావిస్తోంది. ఈ కాన్పెప్ట్, దాని పని తీరు గురించి స్టేట్ అసోసియేషన్లకు ఈ మెయిల్ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే బేస్‌బాల్, రగ్బీ, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్‌లో అమలు చేస్తున్న ఈ కాన్సెప్ట్‌ను గతంలోనే తీసుకురావాలని భావించినా కుదరలేదు. కానీ ఇప్పుడు ముస్తాక్ అలీ ట్రోఫీతో మరో కొత్త అడుగు వేయబోతున్నారు. ‘రోజురోజుకు టీ20 క్రికెట్‌కు పెరుగుతున్న విశేష ఆదరణ కారణంగా కొత్త కోణాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీక్షకుల కోణంలో నుంచే కాకుండా టీమ్స్ స్ట్రాటజీ పాయింట్ నుంచి కూడా ఈ రూల్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది, ఈ రూల్ వల్ల తుది 11 మందిలో ఒకర్ని రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది’ అని బోర్డు పేర్కొంది.
ఈ రూల్ ఎలా పని చేస్తుంది?
టాస్ సమయానికి ప్రతి జట్టు ఫైనల్ ఎలెవన్‌తో పాటు నలుగురు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల పేర్లను ఇవ్వాలి. ఇందులో నుంచి ఒకర్ని మ్యాచ్ సందర్భంగా సబ్‌స్టిట్యూట్‌గా ఉపయోగించుకోవచ్చు.
ఇన్నింగ్స్14వ ఓవర్ పూర్తయే లోపు ఆ సబ్‌స్టిట్యూట్ పేరును ఫీల్డ్ అంపైర్‌కు ఇవ్వాలి. అతను పూర్తి ఓవర్లు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ టీమ్ స్ట్రాటజీని మరింత పెంచుతుంది. అతను పోషించే పాత్రపై పరిమితి ఉండదు. అదే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ అయితే కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయగలడు. బ్యాటింగ్, బౌలింగ్ చాన్స్ ఉండదు.
ఇంపాక్ట్, సబ్‌స్టిట్యూట్‌కు ఇదే పెద్ద తేడా
ఒకవేళ ఎవరైన బ్యాటర్ ఔటైతే అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే వ్యక్తి బ్యాటింగ్, బౌలింగ్ చేయొచ్చు. కానీ 11 మందినే బ్యాటింగ్‌కు ఉపయోగించుకోవాలి. ఒకవేళ కొన్ని ఓవర్లు వేసిన బౌలర్ ప్లేస్‌లో వస్తే తన పూర్తి కోటా (4) కంప్లీట్ చేయొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్ వల్ల టాస్ ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. టీమ్ టాస్ ఓడిపోయి సెకండ్ బౌలింగ్ చేయాల్సి వస్తే బౌలింగ్‌ను బలోపేతం చేసుకోవచ్చు. ఎందుకంటే మంచు ప్రభావం వల్ల రెండో ఇన్నింగ్స్ బౌలింగ్‌లో ఇబ్బందులు ఉంటాయి. అలాగే జీవం లేని పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో అదనపు బ్యాటర్‌తో బ్యాటింగ్‌నూ బలోపేతం చేసుకోవచ్చు. మ్యాచ్‌లో ఎవరైనా గాయపడినా అతని ప్రభావాన్ని తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. వర్షం లేదా ఇతర కారణాలతో ఓవర్లను కుదించిన మ్యాచ్‌లో స్లైడింగ్ కటాఫ్ పాయింట్‌తో ఇంపాక్ట్ ప్లేయర్‌ను రంగంలోకి దించొచ్చు. ఉదాహరణకు 17 ఓవర్ల మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌ను 13వ ఓవర్ ముగిసేలోపు తీసుకోవచ్చు. 11 ఓవర్ల మ్యాచ్‌లో 9వ ఓవర్‌లోపు రావొచ్చు.10 కంటే తక్కువ ఓవర్ల మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమలు కుదరదు. 20 ఓవర్ల మ్యాచ్‌గా మొదలై.. 10 ఓవర్లు కంప్లీట్ అయిన తర్వాత అనివార్య కారణాలతో ఇన్నింగ్స్‌కు అంతరాయం కలిగినా ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఇరుజట్లూ ఉపయోగించుకోవచ్చు. ఏదైనా కారణాలతో రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్లు 10 కంటే తక్కువైనా ఇంపాక్ట్ ప్లేయర్‌ను వాడుకోవచ్చు. మూడు లేదా ఐదో ఓవర్లలో ఈ చాన్స్‌ను తీసుకోవచ్చు. నార్మల్‌గా ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఓవర్ ముగిశాకే తీసుకోవాలి. వికెట్ పడినప్పుడు, ఫీల్డర్ గాయపడినప్పుడు మాత్రం ఓవర్ మధ్యలోనూ తీసుకునే వెలుసుబాటు ఉంటుంది. గాయపడిన ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్‌తో భర్తీ చేసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్‌కు అవకాశం ఇచ్చిన ఆటగాడు తిరిగి గ్రౌండ్లోకి రాకూడదు. బౌలర్ సస్పెండ్ అయినా, ఒకే ఓవర్‌లో రెండు బీమర్స్ వేసిన బౌలర్ ప్లేస్‌లోనూ ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. కానీ సదరు బౌలర్ బౌలింగ్ చేయలేడు.
