
లెజెండ్స్ క్రికెట్ లీగ్ నుంచి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వైదొలిగాడు. ఇండియన్ మహారాజాస్ తరఫున గంగూలీ ఆడాల్సి ఉండగా...సమయం లేకపోవడం వల్ల లీగ్లో పాల్గొనడం లేదని గంగూలీ ప్రకటించాడు. అయితే సెప్టెంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇండియన్ మహారాజాస్ వరల్డ్ ఎలెవన్ మ్యాచ్కు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు.
నిరంతర పని కారణంగా ఆడలేకపోతున్నా..
లెజెండ్స్ క్రికెట్ లీగ్లో పాల్గొనే తన క్రికెట్ సహచరులకు గంగూలీ శుభాకాంక్షలు తెలిపాడు. లెజెండ్స్ లీగ్ చొరవకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రిటైర్డ్ క్రికెటర్లను క్రికెట్ ఫీల్డ్‌కి తిరిగి తీసుకురావడం, అభిమానులతో మమేకం కావడం ఒక అద్భుతమైన ఆలోచన. ఇందులో ఆడే అవకాశాన్ని నాకు అందించినందుకు కృతజ్ఞతలు. "అయితే నా వృత్తిపరమైన కట్టుబాట్లు, క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌తో నిరంతర పని కారణంగా.. నేను ఈ గేమ్‌లో పాల్గొనలేను. అభిమానులు ఈ లీగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. స్టేడియంలో మాజీ క్రికెటర్ల అద్భుతమైన ప్రదర్శన చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మ్యా్చ్ ఆడకపోయినా నేను ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో మ్యాచ్‌ని చూస్తాను... అని గంగూలీ తెలిపాడు.
ఫ్యాన్స్ నిరాశ...
సెప్టెంబర్ 16న వరల్డ్ ఎలెవన్తో ఇండియన్ మహారాజాస్ మ్యాచ్ ఉంది. అయితే గంగూలీ నిర్ణయంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. పదేళ్ల తర్వాత బెంగాల్ టైగర్ మైదానంలో దిగబోతున్నాడని ఫ్యాన్స్ ఆనందపడ్డారు. ఇప్పుడు సమయం లేని కారణంగా గంగూలీ తప్పుకోవడంతో అభిమానులు తెగ ఫీలవుతున్నారు.
కెప్టెన్గా సచిన్..
సెప్టెంబర్16 నుంచి అక్టోబర్ 8 వరకు లెజెండ్స్ క్రికెట్ లీగ్ జరగనుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా.. కోల్ కతాలోని ఈడెన్ గార్డ్సెన్స్లో ఇండియా మహారాజాస్- వరల్డ్ జెయింట్స్ మధ్య ప్రత్యేక మ్యాచ్తో టోర్నీ స్టార్ట్ అవనుంది. వరల్డ్ ఎలెవన్కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహిస్తుండగా.. ఇండియన్ మహారాజాస్ టీం ను సచిన్ నడిపించనున్నాడు. లీగ్లో భాగంగా సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు జరిగే 3 మ్యాచ్లకు కోల్కతా ఆతిథ్యమివ్వనుంది. దీంతోపాటు ఢిల్లీ, కటక్, లక్నో, జోధ్పూర్లలో మ్యాచులు జరగనున్నాయి. జోధ్పూర్, లక్నో మినహా మిగిలిన వాటిల్లో మూడేసి గేములు నిర్వహించనున్నారు.