
ముంబై: ఇండియా–పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ శనివారం తిరిగి ప్రారంభం కానుంది. వారం పాటు లీగ్‌కు అంతరాయం కలగడంతో మిగిలిన సీజన్ కోసం బీసీసీఐ కీలక మార్పులు చేసింది. ప్లేయర్ల రీప్లేస్‌మెంట్ రూల్స్‌ను సవరించింది. ఇది వరకు రీప్లేస్‌మెంట్స్ విండో 12వ లీగ్ మ్యాచ్ వరకు ఉండేది. కానీ, లీగ్‌కు ఆటంకం ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు, ఇంటర్నేషనల్ షెడ్యూల్, గాయాలు, ఇతర కారణాల వల్ల ఆయా ఫ్రాంచైజీలకు ఈ సీజన్ ముగిసే వరకు తాత్కాలిక రీప్లేస్‌మెంట్స్‌కు బీసీసీఐ అనుమతి ఇచ్చింది.
2026 సీజన్‌కు మాత్రం ఈ రూల్ వర్తించదని తెలిపింది. తాత్కాలిక రీప్లేస్‌మెంట్ కింద ఆయా జట్టులోకి వచ్చే ఆటగాళ్లు వచ్చే సీజన్‌లో రిటెన్షన్‌కు అర్హులు కారు. సదరు ప్లేయర్లు మళ్లీ వేలానికి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఆటగాళ్లు డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి ఇంటర్నేషనల్ కమిట్‌మెంట్స్ కారణంగా లీగ్‌కు దూరమైతే రానున్న రోజుల్లో టెంపరరీ రీప్లేస్‌మెంట్స్ జరిగే అవకాశం ఉంది.
నో చీర్ లీడర్స్.. మ్యూజిక్!
తిరిగి మొదలయ్యే మెగా లీగ్‌ను ఎలాంటి వినోద కార్యక్రమాలు లేకుండా నిర్వహించే అవకాశం ఉంది. మిగిలిన 17 మ్యాచ్‌లను చీర్‌లీడర్స్, డీజేలు లేకుండా నిర్వహించాలని ఇండియా లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ బోర్డును కోరాడు. పాకిస్తాన్‌తో ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల గౌరవార్థం చీర్‌లీడర్స్, మ్యూజిక్ వంటి వినోద కార్యక్రమాలు ఏమీ ఉండకూడదని సన్నీ సూచించాడు. దీనిపై బీసీసీఐ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.