ఐసీసీ దగ్గరే తేల్చుకుంటం: ఆసియా కప్ టైటిల్ వివాదంపై BCCI కీలక నిర్ణయం

ఐసీసీ దగ్గరే తేల్చుకుంటం: ఆసియా కప్ టైటిల్ వివాదంపై BCCI కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ఆసియా కప్ టైటిల్ వివాదంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పంచాయతీని ఐసీసీ దగ్గరే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యింది. 2025, డిసెంబర్ 4 నుంచి 7 వరకు దుబాయ్‌లో జరగనున్న ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. తన చేతుల మీదుగానే ఇండియా ఆసియా కప్ టైటిల్ తీసుకోవాలనే ఏసీసీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. 

వివాదం ఏంటంటే..? 

2025 ఆసియా కప్ విజేతగా ఇండియా నిలిచిన విషయం తెలిసిందే. 2025, సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్‎లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‎ను చిత్తు చేసి టీమిండియా విజేతగా అవతరించింది. అయితే.. పహల్గాం ఉగ్రదాడి నిరసనగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్‎గా ఉన్న పాకిస్తాన్ మంత్రి మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు ఇండియా నిరాకరించింది.

టోర్నీ విజేతగా నిలిచినప్పటికీ ఒట్టి చేతులతోనే దుబాయ్ నుంచి టీమిండియా ప్లేయర్స్ ఇండియా తిరిగొచ్చారు. దీంతో ఆసియా కప్ టైటిల్‎ను తన వెంటే తీసుకెళ్లారు మోహ్సిన్ నఖ్వీ. ఈ క్రమంలో ఆసియా కప్ 2025 ట్రోఫీని వెంటనే భారత క్రికెట్ జట్టుకు అందించాలని డిమాండ్ చేస్తూ ఏసీసీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీకి బీసీసీఐ మెయిల్ పంపింది. బీసీసీఐ మెయిల్‎కు మోహ్సిన్ నఖ్వీ అంతే ఘాటుగా సమాధానమిచ్చాడు.

ఆసియా కప్ ట్రోఫీని భారతదేశానికి అప్పగించడం కుదరదని తేల్చి చెప్పాడు. ట్రోఫీని ఇండియాకు పంపేది లేదని కుండబద్దలు కొట్టాడు. ఒకవేళ బీసీసీఐ ట్రోఫీ కావాలనుకుంటే.. దుబాయ్‎లో ఒక ప్రజెంటేషన్ వేడుకను నిర్వహించి.. ఆ వేడుకలో తన చేతుల మీదుగా బీసీసీఐ అధికారి, ఒక టీమిండియా ప్లేయర్ ఆసియా కప్ టైటిల్ తీసుకోవచ్చని తెలిపాడు.

ALSO READ : రేపు అసలు మిస్ అవ్వకండి..

అయితే.. నఖ్వీ ప్రతిపాదనను బీసీసీఐ అంగీకరించలేదు. ట్రోఫీ అప్పగింతకు సంబంధించి నఖ్వీ ప్రపోజల్‎ను మేము అంగీకరించమని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఆసియా కప్ టైటిల్ వివాదాన్ని ఐసీసీ దగ్గరకు తీసుకెళ్తామని.. రాబోయే ఐసీసీ బోర్డు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆయన తెలిపారు.