ఫోన్‌ హ్యాకింగ్‌ మార్గాలివే.. జాగ్రత్త

ఫోన్‌ హ్యాకింగ్‌ మార్గాలివే.. జాగ్రత్త

కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, మీడియా వ్యక్తులు సహా అనేక మంది ప్రముఖుల ఫోన్లను పెగాసస్ సాఫ్ట్‌వేర్‌‌తో హ్యాకింగ్ చేశారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. మన ఫోన్‌లో డేటా మొత్తాన్ని  మన తెలియకుండా ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో హ్యాకర్లు చూసేస్తారు. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, వాట్సాప్‌ చాట్ ఇలా ఒకటేమిటి అన్నీ మనకు తెలియకుండానే వేరెవరో చూస్తుంటారు. అంతేకాదు, మన కెమెరాను కూడా మనకు తెలియకుండా ఆన్‌ చేసి మనం ఏం చేస్తున్నామో కూడా చూడగలరు. హ్యాకింగ్‌, స్పైయింగ్‌లో పెగాసస్ అనేది అత్యంత శక్తిమంతమైన, అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్. అయితే ఇదొక్కటే కాదు మన ఫోన్లను హ్యాక్ చేసి, మనం ఏం చేస్తున్నామో స్పై చేసే స్పైవేర్, మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్లు చాలానే ఉన్నాయి. వీటి సాయంతో హ్యాకర్లు సామాన్య ప్రజల ఫోన్లను కూడా టార్గెట్ చేసి, మన పర్సనల్ డేటా మొదలు బ్యాంకు వివరాలు అన్ని తెలుసుకునే ప్రమాదం ఉంది. హ్యాకర్లు మన ఫోన్‌ను ఎక్కోడ ఉండి ఆపరేట్‌ చేసే టెక్నాలజీలు కూడా ఉన్నాయని టెక్నాలజీ ఎక్స్‌పర్టులు చెబుతున్నారు. వాళ్లు మన ఫోన్‌ ఆపరేట్ చేస్తున్నట్లు కూడా తెలియకుండానే ఇదంతా జరిగిపోతుంది. మనకు తెలియకుండా ఎలా హ్యాక్ చేస్తారు? అందుకు హ్యాకర్లు వాడే మార్గాలేంటి? అనేవి ఒక్కసారి చూద్దాం. కొన్ని మార్గాల్లో చేసే హ్యాకింగ్‌ నుంచి మనం ఏం చేసినా తప్పించుకోలేం. మరి కొన్నింటి నుంచి మాత్రం మనం జాగ్రత్తగా ఉండే తప్పించుకునే చాన్స్ ఉంది.
మిస్డ్‌ కాల్ ద్వారా
పెగాసస్ సాఫ్ట్‌వేర్ సాయంతో మిస్డ్‌కాల్ ద్వారా కూడా మన ఫోన్‌లో స్పైవేర్‌‌ను ప్రవేశపెట్టి హ్యాక్ చేయొచ్చు. 2019లో వాట్సాప్‌లో ఉన్న ఒక లూప్‌ హోల్‌ను దాని యాజమాన్యం గుర్తించింది. ఈ లూప్‌ హోల్‌ ద్వారానే టార్గెట్‌ చేసిన ఫోన్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చి, స్పైవేర్‌‌ను ప్రవేశపెడుతున్నట్లు తేలింది. దీని ద్వారా ఆండ్రాయిడ్‌తో పాటు ఐవోఎస్ ఫోన్లను కూడా హ్యాక్ చేయొచ్చు. ఇక్కడ ఆ మిస్డ్‌ కాల్ వచ్చినట్టు కూడా మనకు తెలియదు.
ఫేక్‌ యాప్స్
సైబర్ క్రైమినల్స్, హ్యాకర్లు స్పైవేర్‌‌ను టార్గెట్ చేసిన ఫోన్లలో ప్రవేశపెట్టేందుకు చాలా ఈజీ మార్గం ఫేక్‌ యాప్స్. మామూలుగా స్మార్ట్‌ఫోన్ల యూజర్లకు అవసరమైన యాప్స్‌ను పోలినట్టుగానే ఉండే నకిలీ యాప్స్‌ ప్లే స్టోర్‌‌లో పెడతారు. వాటిలో వాస్తవానికి అసలైన యాప్‌ ఉండదు. మనం తెలియక ఆ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేశామంటే ఆటోమేటిక్‌గా ఫోన్ హ్యాక్ అయిపోతుంది. సోషల్ మీడియాలో, కొన్ని రకాల వెబ్‌సైట్లలో, పోర్న్‌ సైట్లలో కూడా ఈ ఫేక్ యాప్స్‌కు సంబంధించిన లింక్‌ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పొరబాటున కూడా వాటిని క్లిక్ చేయకూడదు. అలాగే కొత్త యాప్స్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది.
వాట్సాప్, ఈ–మెయిల్, ఎస్ఎంఎస్
వాట్సాప్, ఈ–మెయిల్స్, ఎస్ఎంఎస్ ద్వారా కూడా హ్యాకర్లు స్పైవేర్ లింకులు పంపుతారు. లోన్లు ఇస్తామని, జాబ్ ఆఫర్ అని, సర్‌‌ప్రైజ్ గిఫ్ట్ అని, లక్కీ డిప్ అని, ఫోన్‌కు కొత్త ఫీచర్స్ అని ఇలా రకరకాల ఫేక్‌ లింక్స్ క్రియేట్ చేసి వాట్సాప్, ఈమెయిల్, లేదా ఎస్ఎంఎస్‌ ద్వారా పంపి, మీ ఫోన్‌ను హ్యాక్ చేసే ముప్పు ఉంటుంది. పొరబాటున ఆ లింక్‌ను క్లిక్ చేస్తే ఫోన్‌లో హ్యాకర్ పంపిన వైరస్ ఇన్‌స్టాల్ అవుతుంది. దీంతో అది మన డేటాను మొత్తం హ్యాకర్‌‌కు పంపేస్తుంది. ఫోన్‌ ఆ హ్యాకర్ కంట్రోల్‌లోకి వెళ్లిపోతుంది. అందుకే అనవసరంగా పనికిరాని లింక్‌లు ఓపెన్‌ చేయకుండా ఉంటే బెటర్.
సిమ్‌ కార్డ్ స్వాప్
మన పర్సనల్ డేటా పొరబాటున హ్యాకర్లకు దొరికితే హ్యాకర్లు సిమ్‌ కార్డు స్వాప్‌ టెక్నిక్ వాడుతారు. ఆ డేటా సాయంతో హ్యాకర్లు టెలికాం ఆపరేటర్‌‌కు కాల్ చేసి సిమ్ రిప్లేస్‌మెంట్‌ కోసం డిమాండ్ చేస్తారు. ఒకవేళ సిమ్ ఇష్యూ అయితే మన ఫోన్‌లో ఉన్న పాత సిమ్‌ డీయాక్టివేట్ అవుతుంది. దీంతో ఇక హ్యాకర్‌‌కు మన ఫోన్‌ నంబర్‌‌ ఫుల్ యాక్సిస్ వచ్చేస్తుంది. దీంతో మన బ్యాంక్ లావాదేవీలు, ఓటీపీలు అన్నీ ఆ ఫోన్‌కే వెళ్తాయి. అయితే ప్రస్తుతం సిమ్ తీసుకోవాలంటే ఆధార్ లింక్, బయో మెట్రిక్ తప్పనిసరి కావడంతో ఈ ప్రమాదం కొంత వరకు తగ్గుతుంది. కానీ సిమ్ క్లోనింగ్ అనే మరో ప్రక్రియ ద్వారా మన సిమ్ యాక్టివ్‌లో ఉండగానే, మన నంబర్‌‌తోనే ఇంకో సిమ్‌ క్రియేట్ చేసే టెక్నాలజీ కూడా వచ్చింది. ఇది ఇంకా డేంజర్. అందుకే ఆధార్ నంబర్ లాంటి మన పర్సనల్ డేటాను లీక్‌ కాకుండా చూసుకోవాలి.
బ్లూటూత్‌ హ్యాకింగ్
బ్లూటూత్‌ సహాయంతో కూడా హ్యాకర్లు ఒక నిర్ణీత దూరంలో ఉన్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను హ్యాక్ చేసే చాన్స్ ఉంది. ఇందుకోసం హ్యాకర్లు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు. ఈ హ్యాకింగ్ ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లో జరుగుతుంది. పబ్లిక్ వై-ఫైని వాడే వాళ్లు హ్యాకర్లకు ఈజీ టార్గెట్ అవుతారు. అందుకే పబ్లిక్ వైఫైని వాడకపోవడం మంచిది. అలాగే మీ వైఫైని ఓపెన్‌గా వదిలేయకుండా ఉండాలి. కచ్చితంగా స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవాలి.