సంపద పెంచుతాం.. ప్రజలకు పంచుతాం : బీర్ల ఐలయ్య

సంపద పెంచుతాం.. ప్రజలకు పంచుతాం : బీర్ల ఐలయ్య
  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : బీఆర్ఎస్ లూటీ చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి సంపద పెంచి.. ప్రజలకు పంచుతామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. శనివారం యాదగిరిగుట్టలోని బీర్ల నిలయం ప్రాంగణంలో ఆలేరు నియోజకవర్గానికి చెందిన 236 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమపాళ్లలో అమలు చేస్తోందని పేర్కొన్నారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ రాష్ట్ర సంపదను ఖాళీ చేస్తే.. విదేశీ పెట్టుబడులు తెస్తూ రాష్ట్ర సంపదను పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

బీఆర్ఎస్ అసమర్థత పాలన కారణంగా దివాలా తీసిన రాష్ట్రాన్ని అభివృద్ధిలో దూసుకెళ్లేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. అంతకుముందు తుర్కపల్లి మండలం ధర్మారం నుంచి బిల్యానాయక్ తండా వరకు ఏర్పాటు చేసే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యా మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజుగౌడ్, నాయకులు పాల్గొన్నారు. 

జవాన్ల కోసం ఎమ్మెల్యే కొడుకు విరాళం..

దేశ సరిహద్దులో పాకిస్తాన్ ఉగ్రమూకలతో వీరోచితంగా పోరాడిన జవాన్ల సహాయార్థం.. తన కొడుకు బీర్ల శివమణి తన కిడ్డీ బ్యాంకు నుంచి రూ.లక్ష విరాళం అందజేయనున్నట్లు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. సోమవారం కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా రూ.లక్ష విరాళాన్ని ప్రధానమంత్రి నిధికి ట్రాన్​ఫర్ చేయనున్నట్లు వెల్లడించారు.