పాక్ టెర్రరిస్టుపై నిషేధం విధించాలన్న ఇండియా

పాక్ టెర్రరిస్టుపై నిషేధం విధించాలన్న ఇండియా

యునైటెడ్ నేషన్స్: పాకిస్తాన్ టెర్రరిస్టుకు చైనా మరోసారి అండగా నిలిచింది. లష్కరే తాయిబా లీడర్ షాహిద్ మహ్ మూద్ (42) ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించి, నిషేధం విధించాలని ఐక్యరాజ్య సమితిలో ఇండియా, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకున్నది. పాక్ టెర్రరిస్టులపై నిషేధం విధించాలని చేసిన ప్రతిపాదనలను చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారి. యూఎన్ భద్రతా మండలి 1267 అల్ కాయిదా ఆంక్షల కమిటీ కింద మహ్ మూద్ ను ఇంటర్నేషనల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని భారత్, అమెరికా ప్రతిపాదించాయి. 26/11 టెర్రర్ అటాక్ లో చనిపోయిన వారికి నివాళులర్పించేందుకు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఇండియాలో పర్యటిస్తున్న సమయంలో  చైనా ఈ ప్రపోజల్ ను అడ్డుకుంది.  

టెర్రర్ సంస్థ లష్కరే తాయిబాకు నిధులు అందకుండా ఉండేందుకు 2016 డిసెంబరులోనే మహ్ మూద్ తోపాటు మరో లష్కరే టెర్రరిస్టు ముహమ్మద్ సర్వార్ ను అంతర్జాతీయ టెర్రరిస్టులుగా అమెరికా ప్రకటించింది. కరాచీలో మహ్​మూద్.. ఏండ్లుగా  లష్కరే సభ్యుడిగా ఉన్నాడని, 2007 నుంచి ఆ సంస్థలో అతను పనిచేస్తున్నాడని అమెరికా తెలిపింది. లష్కరేకు నిధులు సమకూర్చిపెట్టే ఫలాహి ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్) కు అతను వైస్ చైర్మన్ గా కూడా పనిచేశాడని యూఎస్ వెల్లడించింది. ఇండియా, అమెరికాపై  దాడులు చేయడమే లష్కరే ప్రథమ కర్తవ్యంగా ఉండాలని టెర్రరిస్టులను అతను రెచ్చగొట్టేవాడని యూఎస్ విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా పాక్ టెర్రరిస్టు అబ్దుల్ రెహ్​మాన్ మక్కీపైనా బ్యాన్ విధించాలని ఇండియా, అమెరికా ఈ ఏడాది జూన్ లో యూఎన్​లో చేసిన తీర్మానాన్నీ చైనా అడ్డుకుంది.