
న్యూఢిల్లీ: ఆటోమోటివ్ కాంపోనెంట్ తయారీ సంస్థ బెల్రైజ్ ఇండస్ట్రీస్ తన రూ.2,150 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం ఒక్కో షేరు ధరను రూ.85-–90 మధ్య నిర్ణయించింది. ఐపీఓ ఈ నెల 21న మొదలై 23వ తేదీన ముగుస్తుంది. యాంకర్ పెట్టుబడిదారుల కోసం ఒకరోజు బిడ్డింగ్ మే 20న ప్రారంభం కానుందని కంపెనీ ప్రకటించింది. ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ ఉండదు. ఫ్రెష్ఇష్యూ మాత్రమే ఉంటుంది. కంపెనీ రూ.1,618 కోట్ల విలువైన ఆదాయాన్ని అప్పుల చెల్లింపు కోసం ఉపయోగించుకోవాలని భావిస్తోంది.
గత డిసెంబర్ నాటికి కంపెనీ దాదాపు రూ.2,600 కోట్ల అప్పు ఉంది. బెల్రైజ్ ఇండస్ట్రీస్ అన్ని రకాల వెహికల్స్సేఫ్టీ క్రిటికల్ సిస్టమ్స్, ఇతర ఇంజనీరింగ్ సొల్యూషన్స్‌ను అందిస్తుంది. ఇది అంతర్జాతీయంగానూ తన ఉత్పత్తులను మార్కెట్ చేస్తుంది. బజాజ్ ఆటో, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, హీరో మోటోకార్ప్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్స్ వంటి కంపెనీలకు సేవలు అందిస్తోంది. డిసెంబర్ 2024 నాటికి దీనికి 10 రాష్ట్రాలలో 17 ప్లాంట్లు ఉన్నాయి.
ఈ నెల 20న బోరానా వీవ్స్ ఐపీఓ
దుస్తుల తయారీ సంస్థ బోరానా వీవ్స్ లిమిటెడ్ తన ఐపీఓను ఈ నెల 20న ప్రారంభించనుంది. ఇది 22వ తేదీన ముగుస్తుంది. షేరు ధరను రూ.205–రూ.216 మధ్య నిర్ణయించారు. కంపెనీ ఐపీఓ నిధులను విస్తరణ, కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగిస్తుంది. అప్పర్ బ్యాండ్ ముగింపు ద్వారా రూ.144.88 కోట్లు సమకూరుతాయని కంపెనీ భావిస్తోంది. ఇందుకోసం ఫ్రెష్ ఇష్యూ ద్వారా 67.08 లక్షల షేర్లను అమ్ముతారు. ఓఎఫ్ఎస్ ఇష్యూ ఉండదు. ఇన్వెస్టర్లు కనీసం 69 షేర్లకు బిడ్వేయాలి.